జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్ షా దృష్టి !

హోమ్ శాఖ మంత్రిగా పదవీ బాద్ధ్యతలు చేపట్టగానే అమిత్ షా మొదటగా జమ్మూకాశ్మీర్ పై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలిగిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికారణాలను తొలగించే అంశంపై కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ముందుగా దృష్టి సారిస్తున్నారు. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

ఈ విషయమై గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఐబి డైరెక్టర్ రాజీవ్ జైన్, హోమ్ కార్యదర్శి రాజీవ్ గౌబాలతో వరుసగా భేటీలు జరుపుతున్నారు. హోమ్ మంత్రిత్వ శాఖలోని జమ్మూ, కాశ్మీర్ డివిజన్ ను కూడా బలోపేతం కావింపనున్నారు. 

1999 డిసెంబర్ 18 నుండి జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. జులై 3న రాష్ట్రపతి పాలనను పొడిగించే అవకాశం ఉంది. 1991లో షెడ్యూల్డ్ తెగల హోదా కల్పించిన గుజ్జర్లు, బకెర్వాలాలు, గడ్డిస్, సిప్పీస్ లు జనాభాలో 11 శాతం ఉన్నారు. వారికి కూడా అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా అసెంబ్లీ స్వరూపాన్నే మార్చివేయడం కోసం, జమ్మూ, లడక్ ప్రాంతాల ప్రాతినిధ్యం పెంపెందుకు దోహదపడే అవకాశం ఉంది. 

చివరి సారిగా 1995లో రాష్ట్రపతి పాలన ఉండగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. .అయితే 2026 వరకు తిరిగి పునర్విభజన జరపానవసరం లేదని 2002లో ఫారూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం చట్ట సవరణ తీసుకు వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్రపతి పాలనలో రాష్ట్రం ఉండడంతో గవర్నర్ ఆ నిబంధనను మార్పు చేసే వీలుంది.