ఆర్బీఐ జోక్యంతో ఆగిన రూపాయి పతనం

రూపాయి మారకం విలువ శుక్రవారం నాడు రిజర్వ్‌బ్యాంక్ జోక్యంతో 26 పైసలు కోలుకుని రూ. 71.73 వద్ద ముగిసింది. ప్రారంభంలో రూ. 72.04ను తాకిన డాలర్‌తో మారకం విలువ మరింత పతనం కాకుండా ఉండేందుకు రిజర్వు బ్యాంక్ భారీ డాలర్లను విక్రయించడంతో రికవరీ అయింది. వరుస పతనం తర్వాత ప్రభుత్వం ఆర్థికవ్యవస్థపై సానుకూల వ్యాఖ్యానాలు చేయడంతోపాటు, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువపై విశ్వాసాన్ని పెంచే చర్యలు చేపట్టడంతో సెంటిమెంట్ ఒక్కసారిగా పుంజుకుంది.

గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో రూ. 1.89 నష్టపోయి చరిత్రలోనే అత్యధిక పతనాన్ని నమోదు చేసింది. అయితే పౌండ్‌తో మారకం విలువ మాత్రం స్వల్పంగా తగ్గి రూ. 93.08 నుంచి రూ. 93.19 కు పడిపోయింది. అలాగే జపాన్ యెన్‌తో మారకం విలువ ఒక పైసా తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 13 శాతం నష్టపోయిన రూపాయి మారకం విలువ ఆసియా కరెన్సీలన్నింటి కన్నా ఎక్కువగా నష్టపోయింది.

దేశంలో విదేశీ పెట్టుబడులు తగ్గడం, వాణిజ్య లోటు పెరుగుతూ ఉండడం, జీఎస్టీ వసూళ్లు కూడా గత నెలల తక్కువగా ఉండడంతో పాటు అమెరికా - చైనా వాణిజ్య సుంకాల పోరు కరెన్సీ మార్కెట్‌లో ఆటుపోట్లను సృష్టిస్తున్నది. మరో వైపు చమురు ధరలు పెరుగుతూనే ఉండడంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు పెరిగాయి. దీంతో రిజర్వ్‌బ్యాంక్ తదుపరి పరపతి విధానంలో వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

దేశ విదేశీ కరెన్సీ నిల్వలు ఈవారం కూడా తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 31తో ముగిసిన వారంతానికి విదేశీ కరెన్సీ నిల్వలు 191. 1 కోట్ల డాలర్లు తగ్గి 400.101 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వుబ్యాంకు విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను విక్రయించడంతో ఈ వారం విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గాయి.

కాగా, మొత్తం రిజర్వులలో ప్రధాన భాగం అయిన విదేశీ కరెన్సీ ఆస్తులు 605.1 మిలియన్ డాల ర్లు తగ్గి 375.986 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో డాలర్లతో పాటు ఇతర విదేశీ కరెన్సీలు కూడా ఉంటాయి. ఇదిలాఉండగా, బంగారం రిజర్వులు కూడా 600.9 మిలియన్ డాలర్లు తగ్గి 20.162 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.