చంద్రబాబు భూదందాల లోగుట్టు పై జగన్ కసరత్తు

పారిశ్రామిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపిన భూదందా లోగుట్టు వెలికి తీయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ససరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే సంస్థలకు ఎంతెంత కేటాయింపులు చేశారన్న వివరాలను జగన్‌ ఇప్పటికే అధికారులను అడిగినట్లు తెలిసింది. 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో ప్రభుత్వం జిల్లాకు లక్ష ఎకరాలు చొప్పున 13 లక్షల ఎకరాలు సేకరించనున్నట్లు ప్రకటించింది. విజన్‌ డాక్యుమెంటులోని పారిశ్రామికాభివృద్ది అంశంలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. 2015 అక్టోబర్‌ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7.82 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. 

ఆయా భూములను కూడా విదేశాల నుండి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు తొలి ప్రాధాన్యతగా కేటాయింపులు జరపాలని చంద్రబాబు ప్రభుత్వం తెలిసింది. అప్పటికప్పుడు కేటాయించేందుకు వీలుగా 2.73 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇలా కేటాయింపులు చేయడం కోసం చట్టాలను సవరించింది. ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు ఒక ప్రైవేటు వ్యక్తిని నియమించి అతనిద్వారా పెద్దఎత్తున వ్యవహారం నడిపించింది. 

ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల పేరుతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 7500 ఎకరాలు సేకరించాలని అధికారులను అప్పటి సిఎం ఆదేశించారు. టెక్నాలజీ అభివృద్ది కోసం అంకుర ప్రాజెక్టుల పేరుతో మరికొన్ని సంస్థలకు భూ కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిప్పటి నుండి ఇప్పటి వరకూ వేర్వేరు కంపెనీలకు ఎపిఐఐసి ద్వారా సుమారు 32 వేల ఎకరాలు కేటాయించారు. అవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. కంపెనీల పరిస్థితులు ఏమిటి అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని జగన్మోహన్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. 

విశాఖపట్నం నుండి తడ వరకూ విశాఖ, చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌(విసిఐసి) పేరుతో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక నడవకు భూముల కేటాయింపు అంశంపైనా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముందే నివేదికలివ్వాలని కోరినట్లు తెలిసింది. అమరావతి నుండి అనంతపురం వరకూ నిర్మించనున్న జాతీయ రహదారికి చుట్టుపక్కల జరిగిన భూ లావాదేవీలపైనా నివేదిక కోరినట్లు తెలిసింది.