జగన్‌, కేసీఆర్‌ ఎన్డీయే కూటమిలో చేరండి !

తెలుగు రాష్ట్రాల్లో ప్రజల అభివృద్ధి కోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో  టీఆర్‌ఎస్‌, వైసిపి  చేరాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే కోరారు. ఎన్డీయేకు 353 సీట్లు, బిజెపికి  303 సీట్లు రావడంతో.. ఎవరి మద్దతూ అవసరం లేదని, అయినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరింతగా బలపరిచేందుకు కేసీఆర్‌, జగన్‌ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని టిడిపి  అధినేత చంద్రబాబుకు అప్పట్లోనే సూచించానని గుర్తు చేశారు.

ప్రత్యేకహోదాకోసం ఏపీతో పాటు మరిన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయని, అయితే ఏపీ రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉందని స్పష్టం చేశానారు. ‘ఏపీలో గెలుపొందిన జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు. చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీపై తీవ్రంగా మాటలదాడి చేశారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశమంతా తిరిగినా మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రజలు బాబుకు మద్దతు పలకకుండా జగన్‌ను గెలిపించారు' అని పేర్కొన్నారు.

`కేసీఆర్‌ నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎన్డీయేలో చేరాలని కోరుతున్నా. ఇది నా సలహా మాత్రమే. నిర్ణయంపై వారిద్దరూ ఆలోచించుకోవాలి. మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గత 15 ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ను మోదీ సర్కారు 10% రిజర్వేషన్లతో నెరవేర్చింది' అని తెలిపారు.

కాగా, బిజెపి సర్కారు ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఎస్సీలపై వేధింపులు, దాడుల కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ  వీటిని అరికట్టాల్సి ఉందని చెప్పారు. పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహ ధ్వంసంపై జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖరాసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసిన్నట్లు తెలిపారు. మోదీ సర్కారు రాజ్యాంగాన్ని కాపాడుతోంది. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన ఎవరికీ లేదని పేర్కొన్నారు.