భారంగా మారుతున్న విదేశీ రుణాలు

రూపాయి మారకం విలువ పతనం కారణంగా కేవలం చమురు బిల్లు పెరగడమొక్కటే కాకుండా విదేశీ రుణాలు కూడా తలకు మించిన భారంగా పరిణమించాయి. ఈ ఏడాది డాలర్‌తో మారకం విలువ 13 శాతం తగ్గిన నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో స్పల్పకాలిక విదేశీ రుణాలను చెల్లించడానికి అదనంగా దాదాపు రూ. 68,500 కోట్లను వెచ్చించాల్సి వస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.

వర్థమాన దేశాల్లో పెరుగుతున్న రిస్క్‌లు, దేశీయంగా కరెంట్ ఖాతాలోటు పెరుగుతూ ఉండడంతో గురువారం నాడు రూపాయి మారకం విలువ రూ. 72ని దాటేసింది. ఒకవేళ రూపాయి మారకం విలువ సగటున ఈ ఏడాదికి రూ. 73 వద్ద స్థిరపడితే, 2018 ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరునెలల కాలానికి క్రూడాయిల్ ధర సగటున 76 డాలర్లగా ఉంటే మన దేశం అదనంగా రూ. 45,700 కోట్లను ముడి చమురు దిగుమతి కోసం చెల్లించాల్సి వుంటుందని ఎస్‌బీఐ ఛీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ సౌమ్యా కాంతి ఘోష్ రాసిన ఒక నోట్‌లో పేర్కొన్నారు.

2017 లో కంపెనీలు తీసుకున్న విదేశీ వాణిజ్య రుణాలు, ఎన్‌ఆర్‌ఐల డిపాజిట్లు మొత్తం కలిపి 217.6 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఇందులో సగం రుణాలను ఇప్పటికే చెల్లించారని అనుకుందాం. లేదా వచ్చే ఏడాదికి రోలోవర్ చేశారనుకుందాం. మిగతా సగం మొత్తాన్ని చెల్లించడానికి రూ. 7.1 లక్షల కోట్లను డాలర్ కు 2017 ఏడాదికి సగటున మారకం విలువ రూ. 65.1 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

వచ్చే ఆరు నెలలకాలానికి సగటున డాలర్‌కు 71.4 చొప్పున రూ.7.8 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల దాదాపుగా రూ. 70వేల కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన విశ్లేషించారు.

జూన్ ముగిసిన త్రైమాసికానికి మనదేశ విదేశీ రుణాలు రూ.79.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 77.98 లక్షల కోట్ల రుణాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్యకాలంలో రూ. 1.44 కోట్ల రుణాలను ప్రభుత్వ సెక్యూరిటీల జారీ ద్వారా సమీకరించినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.

దేశ కరెంటు ఖాతాలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీలో 2.4 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదేకాలంలో 2.5 శాతంగా ఉంది. ఈ లోటు విలువ 158 బిలియన్ డాలర్లు.