తెలంగాణకు ఏపీ భవనాల అప్పగింత

హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి మండలి వినతి మేరకు ఆదివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి దీనికి అంగీకరించారని తెలిసింది. దీంతో తెలంగాణ ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న భవనాల సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమ కార్యాలయాలు నిర్వహించుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని భవనాలను కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకు గానూ కేంద్రం గవర్నర్‌ ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. ఆయన ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, ప్రధాన కార్యదర్శులు సమావేశమై భవనాల విభజన నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా 2014 మే నెలలో భవనాలను గవర్నర్‌ అధ్యక్షతన గల కమిటీ కేటాయింపులు జరిపింది.

జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో కార్యాలయాల స్థలాలూ కేటాయించారు. అందులో భాగంగా రాష్ట్ర సచివాలయంలో జె,కె,ఎల్‌,హెచ్‌ (ఉత్తర, దక్షిణ) బ్లాక్‌లను ఏపీకి ఇచ్చారు. అలాగే శాసన సభలో పాత భవనాన్ని, జూబ్లిహాలు (మండలి)ను కేటాయించారు. లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించుకునేందుకు ఇచ్చారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు భవనంలోని దాదాపు 145పైగా శాఖాధిపతుల కార్యాలయాలు, టీఎస్‌ఐఐసీ, సంక్షేమ భవనం, రాష్ట్ర ఆర్థిక సంస్థ, 89 కార్పొరేషన్ల భవనాలు, మంత్రుల నివాస ప్రాంగణాలు, ఎమ్మెల్యేల గృహ సముదాయాలు, వివిధ కార్యాలయాల భవనాలను ఏపీకి బదలాయించారు.

సచివాలయంలో ఏపీ సీఎం, మంత్రులు దాదాపు రెండేళ్లపాటు కొనసాగారు. దీంతో కార్యాలయాల వినియోగం పూర్తిస్థాయిలో జరిగింది. ఆ తర్వాత ఏపీ రాజధాని అమరావతికి తరలిపోగా కార్యాలయాలు కూడా అక్కడికి తరలిపోయాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లోని భవనాలు నిరుపయోగంగా మారాయి. వాటి తాలూకు ఆస్తి పన్ను, నీటి, విద్యుత్‌ బకాయిలు రూ.5 కోట్ల మేర పేరుకుపోయాయి. మరోవైపు తెలంగాణకు భవనాల కొరత ఏర్పడింది.

ప్రధానంగా సచివాలయంలో మంత్రులంతా ఒకటే బ్లాక్‌ (డి)లో సర్దుబాటు కావాల్సి వచ్చింది. శాసన సభ కమిటీ హాళ్లలో రెండు తెలంగాణకు, ఏపీకి మూడు వెళ్లడంతో అక్కడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. జూబ్లీహాలు ఏపీకి ఇవ్వడం వల్ల మండలి నిర్వహణకు మొదట్లో ఇబ్బంది (ఇటీవలే దాన్ని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది) ఏర్పడింది. కేంద్రం వద్ద విభజన సమస్యలపై సమావేశం జరిపినప్పుడల్లా భవనాల అప్పగింత విషయమే చర్చకు వచ్చేది.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ సీఎంతో జగన్‌ భేటీ సందర్భంలో, శనివారం గవర్నర్‌ ఇఫ్తార్‌ విందుకు ఏపీ సీఎం హాజరైన సమయంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో భవనాల సమస్యను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎంలు ఇద్దరూ నిర్ణయించారు.