కార్లు వదిలి స్కూటర్లు, రిక్షాల్లో వెళ్లండి

మనం కార్లను వదిలి ఇతర వాహనాలైన స్కూటర్లు, రిక్షాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. వ్యక్తిగతంగా వెళ్లడం కంటే ప్రజా రవాణా వ్యవస్థను అలవాటు చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించిన వారు అవుతారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేయనున్నదని పేర్కొన్నారు. కాలుష్య రహిత వాహనాల్లో ప్రయాణించడం వల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభిస్తున్నదన్న ఆయన ఇది జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ మూవ్‌ లో ముఖ్యాతిధిగా పాల్గొంటూ  కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ), స్మార్ట్ చార్జింగ్ సదుపాయాల కల్పనలో ఆటోమొబైల్ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. తద్వారా రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చినట్లు, భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతున్నదని మోదీ పేర్కొన్నారు.

స్మార్ట్ మొబిలిటీ వేగంగా విస్తరిస్తున్నదని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు విద్యుత్ వాహనాల వాడకానికి మొగ్గుచూపాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే విద్యుత్ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నదని తెలిపారు.

ఈ సమావేశానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల సీఈవోలు హాజరయ్యారు. వచ్చే ఐదేండ్లకాలంలో దేశవ్యాప్తంగా అమ్ముడవనున్న వాహనాల్లో 15 శాతం ఎలిక్ట్రిక్ వాహనాలు ఉండాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్నదని, దీంతో కాలుష్యాన్ని నియంత్రించిన వారమవుతామని వ్యాఖ్యానించారు. గడిచిన సంవత్సరంలో 2 వేల విద్యుత్ వాహనాలు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

భారత భవిష్యత్తు మొబిలిటీ ఈ ఏడు సీలపై ఆధారపడివుందని, వీటిలో సామాన్యుడు, సదుపాయం, సౌకర్యం, కాలుష్యం లేకుండా, చార్జింగ్, శుభ్రంగా, అత్యాధునికం వంటి కీలకమని చెప్పారు. ప్రైవేట్ వాహనాల కంటే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించడం వల్ల ట్రాఫిక్ జామ్‌ల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని చెబుతూ 100 స్మార్ట్ నగరాలు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే లైన్లు, నౌకాశ్రాయాలు ఇలా ఎన్నో రంగాల్లో మన దేశం పరుగులు పెడుతుందని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జాతీయ రహదారుల నిర్మాణాన్ని రెండింతలు పెంచామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేదానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు.

 కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూఈవీలను ప్రోత్సహించడానికి కంపెనీల ప్రచారం చాలా నిరుత్సాహకరంగా ఉన్నదని విచారం వ్యక్తం చేసారు. ఆటోమొబైల్ సంస్థలు ఇతర కార్లకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈవీలకు ఇవ్వడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. హైబ్రిడ్ కార్లపై ఆయన స్పందిస్తూ తన దగ్గర రెండు కార్లు ఉన్నాయని, వీటిద్వారా 10 నుంచి 15 శాతం వరకు పెట్రోల్ ఆదా అవుతున్నదని చెప్పారు.