పనాజీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అత్యాచారయత్నం కేసు

గోవాలోని పనాజి నియోజకవర్గం నుండి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అటనాసియో మాన్సరట్టే, నగర మేయర్‌ ఉదరు మద్‌కైకర్‌, మాజీ మేయర్‌ యతిన్‌ పరేఖ్‌లపై గోవా పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి ప్రయత్నించారంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు శనివారం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

మాంధవి నది తీరంలోని ఆక్రమణలను, జూద శాలలతో పాటు అక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పనాజి నగర కార్పొరేషన్‌ అధికారులతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, మాజీ మేయర్‌, మేయర్‌లు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్రమణలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.

ఆక్రమణలను వ్యతిరేకిస్తున్న వారిలో ఒక మహిళ శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మాన్సరట్టే, మద్‌కైకర్‌, పరేఖ్‌లు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను దుర్భాషలాడుతూ లైంగికంగా వేధించారని ప్రయత్నించారని ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై ఐపిసి సెక్షన్‌ 323, 354, 504, 506, 509ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

దీనిపై మాన్సరట్టేను సంప్రదించగా అటువంటి సంఘటన ఏదీ జరగలేదన్నారు. ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకే తాను అక్కడకు వెళ్ళినట్లు చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులు ఎవరూ కూడా అలా ప్రవర్తించలేదని తెలిపారు.