ఎపి లోని బెల్టు షాపులను ఎత్తివేయాలి

ఆంధ్రప్రదేశ్‌ లో సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులకు ఆదేశించారు. శనివారం ఆర్థిక, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్‌ ఎన్నికల హామీ మేరకు.. ఎపి లో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి... బెల్ట్‌షాపుల వ్యవస్థను నిర్మూలించాలని జగన్‌ సూచనలు చేశారు.

ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీపడొద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు ఎందుకు చేస్తున్నామని సీఎం నిలదీశారు.  

రాష్ట్రం అప్పుల ఊబిలో ఉండడంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. సామాన్యుడిపై భారం పడకుండా, సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమ శిక్షణను పాటించాలని జగన్‌ పునరుద్ఘాటించారు.  

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా... 15వ ఆర్థికసంఘం ఎదుట సమర్థంగా ఏపీ వాదన విన్పించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, సమస్యలను వివరిస్తూ నివేదిక రూపొందించాలని, ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని అధికారులకు సూచించారు.