రాహుల్ యాత్ర ఫొటో బూటకమా !

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాస మానస సరోవరం వద్ద ఉన్నట్లు కనిపిస్తున్న ఫొటో బూటకమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఆ ఫొటోను ఫొటోషాప్‌‌ను ఉపయోగించి సృష్టించారన్నారు. ఈ ఫొటోలో రాహుల్ గాంధీ, ఆయనతోపాటు ఉన్న వ్యక్తి నీడలు కనిపిస్తున్నాయని, అయితే రాహుల్ గాంధీ చేతిలో ఉన్న కర్ర నీడ కనిపించడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

బీజేపీ సోషల్ మీడియా ప్రతినిథి ప్రీతి గాంధీ కూడా రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫొటోలను ఆయన తన ఫొటోలుగా చెప్పుకుంటూ పోస్ట్ చేస్తున్నారన్నారు.రాహుల్ గాంధీ మానస సరోవర యాత్రపై విమర్శలు చేస్తున్నవారికి సమాధానంగా కొన్ని ఫొటోలను కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆయన కైలాస మానస సరోవరం వద్ద ఉన్నట్లు పేర్కొంది.

కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భక్తికి సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ఆమె అమేథీలో విలేకర్లతో మాట్లాడుతూ ఓ వ్యక్తి తన భక్తిని రుజువు చేసుకుని, సర్టిఫికేట్ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం తాను మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు. భగవంతునికి, భక్తునికి మధ్య సంబంధాన్ని రుజువు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రం అవసరం లేదని తాను భావిస్తున్నానన్నారు. రాహుల్ గాంధీ తన భక్తిని రుజువు చేసుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.