8న జగన్ మంత్రివర్గ విస్తరణ... ఇక వైఎస్‌ఆర్‌ అక్షయపాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈనెల 8న విస్తరించనున్నారు. ఆ రోజు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న వేదికపై కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌  నరసింహన్‌ ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఒకేసారి ఏర్పాటుచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైసిపి  వర్గాలు తెలిపాయి. 

మరోవంక, శనివారంనుంచి వివిధ శాఖల సమీక్షను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆయా శాఖల స్థితిగతులు, ఏ స్థాయిలో మార్పుచేర్పులు చేయాలి? ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనేదీ అంచనా వేయనున్నారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. దీని ఆధారంగా మంత్రుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. 

మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిశాక ఉదయం 11:49 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర నూతన మంత్రివర్గం తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఈ నెల 8న తొలిసారి వెలగపూడిలోని సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8:39 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించనున్నారు. చిన్న మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. 

ఛాంబర్‌లోకి ప్రవేశించాక జగన్‌ కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. జగన్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఇవ్వనున్న ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారంనుంచి తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శాఖల సమీక్షను జగన్‌ కొనసాగించనున్నారు. 

 ఇలా ఉండగా,   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజన పధకంలో సన్నబియ్యం ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలో శుక్రవారం విద్యాశాఖపై ప్రాథమికంగా తొలిసమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్‌ఆర్‌ అక్షయపాత్రగా ముఖ్యమంత్రి ప్రకటించారు.   

మధ్యాహ్న భోజనం కార్మికులకు నెలకు రూ.1000 నుంచి రూ.3,000కు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30లక్షల మంది విద్యార్ధులు పూర్తిస్థాయిలో పాఠశాలలకు హాజరు కావాలని, అందుకు తగిన విధంగా పాఠశాలల మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.