యూనియన్‌ బ్యాంక్‌కు రూ. కోటి జరిమానా

ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాకు రిజర్వ్‌ బ్యాంక్‌ జరిమానా విధించింది. బ్యాంక్‌లో జరిగిన మోసాన్ని సరైన సమయంలో గుర్తించి, నివేదిక పంపనందుకు గానూ రూ. కోటి జరిమానా వేసింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా యూనియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

‘బ్యాంకులో జరిగిన మోసాన్ని గుర్తించి, నివేదిక పంపడంలో ఆలస్యం అయినందుకుగానూ రిజర్వ్‌ బ్యాంకు రూ. కోటి జరిమానా విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం కింద ఆర్‌బీఐకు ఉన్న విశేషాధికారాలతో ఈ జరిమానా వేసింది’ అని యూనియన్‌ బ్యాంక్ తెలిపింది. యూనియన్‌ బ్యాంక్‌కు ఎందుకు జరిమానా వేయకూడదో చెప్పాలంటూ ఈ ఏడాది జనవరిలో రిజర్వ్‌ బ్యాంక్ షోకాజ్‌ నోటీసులు పంపింది.

ఈ నోటీసులకు బ్యాంకు స్పందించింది. అంతేగాక ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ ముందు వివరణ కూడా ఇచ్చింది. అయితే బ్యాంక్‌ సమాధానం అసంపూర్ణంగా ఉందని చెబుతూ రూ. కోటి జరిమానా విధించిందని యూనియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేలా నియంత్రణ చర్యలు చేపట్టామని బ్యాంక్‌ తెలిపింది.