జూన్ 7న జగన్ మంత్రివర్గ విస్తరణ, 11న అసెంబ్లీ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తానొక్కడినే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణను జూన్ 7న జరుపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు జగన్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసనసభ నిర్వహణపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో అసెంబ్లీ అధికారులు చర్చించారు. 

జూన్‌ 11, 12 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరిగే వీలుంది. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే శాసనసభ కార్యాలయానికి సమాచారం అందించారు. జూన్‌ నెలాఖరులో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. 

మరోవైపు జూన్‌ 3 నుంచి 6 వరకు సీఎం హోదాలో శాఖల వారీగా అధికారులతో జగన్‌ సమీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన సచివాలయానికి రానున్నారు. జగన్‌ కోసం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. ఇప్పటికే వైసిపి సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  

ఇలా ఉండగా, ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్ నవరత్నాల అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నవరత్నాలను అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక వనరులు ఏమిటి? అనే విషయాలపై  ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, మాజీ ప్రధానకార్యదర్శి అజేయ కల్లంతో సమీక్షించారు.