మోదీ ప్రమాణ స్వీకారంపై మమత యూటర్న్‌

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్‌ తీసుకున్నారు. నరేంద్ర మోదీ ఈ నెల 30న రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఆమె డుమ్మా కొడుతున్నారు. 

దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన మమతా.. రెండోరోజే మాట మార్చారు. మోదీ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కావడం లేదంటూ మమతా బెనర్జీ ఈ మేరకు ఓ లేఖ రాశారు.

కాగా బెంగాల్‌లో జరిగిన హింసలో 54మంది బీజేపీ కార్యకర్తలు మరణించారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని, బెంగాల్‌లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదని చెప్పుకొచ్చారు. 

పశ్చిమబెంగాల్ హింసాకాండలో మృతిచెందిన 54 మంది వ్యక్తుల కుటుంబాలను ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ ఆహ్వానించడమే మమత తాజా నిర్ణయానికి కారణమైంది. ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్య పండుగలాంటిదని, ఆలాంటి కార్యక్రమం ఏ పార్టీని కించపరచేలా ఉండకూడదని మమత తాజా ట్వీట్‌లో నిప్పులు చెరిగారు.