11న హైదరాబాద్ రానున్న కేంద్ర ఎన్నికల బృందం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దెన నేపథ్యంలో తదుపరి ఎన్నికలు జరపడం కోసం కేంద్ర కేన్నికల సంఘం చురుకుగా అడుగులు వేస్తున్నది. ఈ నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. పర్యటన తరువాత ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యసాధ్యాలపై బృందం నివేదిక ఇవ్వనుంది.

తెలంగాణ శాసనసభ రద్దు అయినట్టు తమకు సమాచారం అందిందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రావత్‌ అంతకు ముందు ఢిల్లీలో తెలిపారు. యంత్రాంగం సన్నద్ధత ఆధారంగా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం రద్దయిన ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఆ సూచనలకు అనుగుణంగానే తాము చర్యలు చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు.

 తదుపరి చర్యలపై నివేదికపంపాలని తెలంగాణ ఎన్నికల అధికారిని కోరినట్టు చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు రావత్‌చెప్పారు.

ఏర్పాట్లను సమీక్షించాక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ ఎన్నికల షెడ్యూల్‌పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు.

మరోవంక, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ సమావేశమయ్యారు. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఒకవేళ ఎన్నికల కమిషన్‌ నిర్ణయిస్తే.. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు రజత్‌కుమార్‌ సూచించారు.

ఇట్లా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండేందుకు ప్రజలు ఎన్నుకున్నారని, పదవీకాలం పూర్తి కాకుండానే మంత్రిమండలి తమ ఇష్టానుసారంగా అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రధానంగా పిటిషనర్‌ ఆరోపించారు. కేబినెట్‌ నిర్ణయం, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం.. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలుగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.

మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం వల్ల రాష్ట్రంలో అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్‌కు ఒకసారి- ఇలా రెండుసార్లు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని, దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని పేర్కొన్నారు. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగే అవకాశముంది.