టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టీడీఎల్పీనేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 శాసనసభాపక్ష నేతగా ఈసారి చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్‌ సభ్యుడు ఎవరికైనా అవకాశమిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. వాటికి తెరదించుతూ... శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. 

 కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుజనాచౌదరి, కకనమేడల రవీంద్రకుమార్‌, కళా వెంకట్రావు, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఇలా ఉండగా,  సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజమమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే, సీనియర్ టిడిపి నేత  గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలను విడిచి సాంకేతికతను నమ్మడమే ఓటమికి మరో కారణమా అని విశ్లేషించాల్సి ఉందని హితవు చెప్పారు. 

గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినా.. అప్పుడు తన మాటలు పట్టించుకోలేదని వాపోయారు. అయినా మళ్లీ చెబుతా, పార్టీ బాగుకోసం సూచనలు చేస్తానని గోరంట్ల వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా  కులాల ప్రస్తావన  వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.