కేసీఆర్ కుటుంబ పాలన నచ్చకనే బీజేపీలో చేరికలు

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నచ్చకనే టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇక తమ టార్గెట్ తెలంగాణ అని, తమ యుద్ధం ప్రారంభమైందని వెల్లడించారు. రాష్ట్రంలో కమల వికాసం తథ్యం చెప్పారు. 

బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు మోదీ హవా వల్లే గెలిచారని ఇప్పుడంటున్న కేటీఆర్.. ఎన్నికల ముందు మోదీ హవా లేదని, దేశ భద్రత సమస్యలో పడిందని అన్నారని గుర్తుచేశారు. కేటీఆర్ మాటలు ఆడలేక మద్దెలఓడులా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును కేటీఆర్ అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

పోస్టల్‌ బ్యాలెట్‌లో కూడా టీఆర్ఎస్‌కు ఆశాభంగమే ఎదురైందని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని బ్రహ్మం గారిలా అసదుద్దీన్ ఒవైసీ ఎప్పుడో అన్నారని, ఇప్పుడు అది జరుగుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ గురించి ఒవైసీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు చెప్పారు . 

కాగా,  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు అయ్యిందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. గెలిచిన మూడు స్థానాలకే పీసీసీ చీఫ్ ఉత్తమ్ జబ్బలు చరుచుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఆ పార్టీలో ఉన్నారో లెక్కలు చెప్పాలని సవాల్ చేశారు. 

ఇప్పుడు గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఉత్తమ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచిన నేతలు టీఆర్ఎస్‌లో చేరి పునీతులు అవుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై పోరాడకుండా పార్టీ మారుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని ఘాటైర వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ గెలిచిన మూడు స్థానాల్లో.. ఏదో గెలావాలి కాబట్టి గెలిచాం అన్నట్లుగా గెలిచారని ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ఉద్దండులపై భారీ మెజారిటీతో గెలిచారని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డను సైతం ఓడించామని గుర్తు చేశారు.