ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం ఎందుకు !

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమన్న ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు భయపడుతున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ కేవలం తెలంగాణ అభివృద్ధి కోసమే ఇప్పుడు ఎన్నికలకు పోవాల్సి వచ్చిందని మరోసారి స్పష్టం చేసారు.  ప్రారంభమైన అభివృద్ధి ఆగిపోకూడదనేది టీఆర్‌ఎస్ ఆశయం అని చెబుతూ తెలంగాణ అభివృద్ధి కోసమే స్వరాష్ట్రంలోనూ పదవులు త్యాగం చేశామని వెల్లడించారు.

కాంగ్రెస్‌ నేతలు దిల్లీ నేతలకు గులాములని ద్వజమేత్తుతూ ఎన్నికలు తేవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌ అని పేర్కొనారు. అవాకులు,  చవాకులు పేలుస్తూ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలకు టికెట్లు రావాలన్నాదిల్లీ నుంచే రావాలని అంటూ ఢిల్లీకి గులాంగిరీ చేద్దామా అధికారం మన చేతుల్లోనే ఉంచుకుందామా అని ప్రజలను అడిగారు.

తెలంగాణ కోసం పేగులు తెగేదాకా, 14 ఏళ్లు పోరాడాం. కాంగ్రెస్‌ పాలన అంతం కావాలనే 2014లో ప్రజలు తెరాసను గెలిపించారని గుర్తు చేసారు. ఎన్నికలు వచ్చినప్పుడు అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాదని అంటూ రాష్ట్రంలో అభివృద్ధి కనిపించకపోతే కాంగ్రెస్‌నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలని హితవు చెప్పారు.

2014కు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎంత నాశనమైందో అందరికీ తెలుసని అంటూ  కాంగ్రెస్ హయాంలో సాలువారి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడు క్రియాశీలకంగా పనిచేయలేదని చెబుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదని దయ్యబట్టారు.

తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని తాము చెప్తే అధి సాధ్యమవుతదా? అని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రశ్నించారని సీఎం గుర్తు చేసారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తే తానే గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి నిండు శాసనసభలో చెప్పిన విషయాన్ని పేర్కొంటూ ఆయనకు నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలని సవాల్ చేసారు.

ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రతిపక్షాలు ఎందుకు నిరూపించలేకపోతున్నాయని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమవుతాయని అంటూ కోతలు లేని విద్యుత్‌ ఇవ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేతకాదని అవహేళన చేసారు. 60 ఏళ్లు దిల్లీకి గులాంగిరీ చేసిన కాంగ్రెస్‌ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అంటూ జీతాలు పెంచమని అడిగిన ఉద్యోగులను గత పాలకులు గుర్రాలతో తొక్కించారని గుర్తు చేసారు.

ఒక సమైక్య పాలకుడు ఒప్పంద ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీ చేయించారని చెబుతూ  సమైక్య పాలనలో కులవృత్తులన్నీ నాశనం అయ్యాయని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛను ఇచ్చిన వారు ఇప్పడు రూ.2వేలు ఇస్తామంటున్నారని అవహేళన చేసారు.