హిందీ బెల్ట్‌లో కులరాజకీయాలకు చెక్ !

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక తీర్పుతో 353 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన ఫలితాలు అందరి దృష్టిని అధికంగా ఆకర్షిస్తున్నాయి. హిందీ బెల్ట్‌లో గణనీయ ఫలితాలను సాధించిన ఎన్డీఏ.. యూపీ, బీహార్‌లోని మొత్తం 120 లోక్‌సభ స్థానాల్లో 103 సీట్లను గెలుచుకుని ప్రతిపక్షాల కుల రాజకీయాలకు చెక్ పెట్టింది. 

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు మహాకూటములు (యూపీలో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి, బీహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి) ఎన్డీఏకి గట్టిపోటీ ఇస్తాయని చాలా మంది అంచనా వేశారు. అయితే ఈ రెండు కూటములు ఘోరంగా విఫలమై బీహార్‌లో ఆర్జేడీకి కనీసం ఒక్క సీటు కూడా లభించకపోవడం, యూపీలో ఎస్పీ-బీఎస్పీ కేవలం 15 సీట్లకే పరిమితమవడంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారని, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న పార్టీలకు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పడం వల్లనే ఈ రెండు రాష్ర్టాల్లో తమ పార్టీ విజయం సాధించిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. 

యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి వైఫల్యానికి చాలా అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డు కులాల (ఎస్సీ) జనాభా 40 శాతం కంటే ఎక్కువగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలు కేవలం మూడు మాత్రమే. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ మూడు నియోజకవర్గాల (బంగావ్, కూచ్‌బెహార్, జల్పాయ్‌గురి) ప్రజలు ఏకగ్రీవంగా బీజేపీకి ఓటేశారు. గత (2014) లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గెలుచుకున్న ఈ మూడు నియోజకవర్గాల్లో బీజేపీ గణనీయంగా లాభపడింది. 

అలాగే ఎస్సీల జనాభా 30 నుంచి 40 శాతం మేరకు ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలు 16 ఉండగా.. మరో 129 నియోజకవర్గాల్లో వారి జనాభా 20 నుంచి 30 శాతం మేరకు ఉన్నది. ఈ మొత్తం 145 సీట్లలో 80 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా.. మిగిలిన వాటిలో ఎక్కువ సీట్లను తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) లాంటి ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. 

దీన్నిబట్టి చూస్తే అగ్రకులాలకు చెందిన పార్టీలకు (వీటిలో బీజేపీ కూడా ఉన్నది) ఎస్సీలు ఓటు వేయలేదన్న అభిప్రాయంలో నిజం లేదని స్పష్టమవుతున్నది. అయితే ఈ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి స్థిరంగా లేదు. ఈ 145 స్థానాల్లో బీజేపీ 2014 ఎన్నికల్లో 67 సీట్లను, 2009లో కాంగ్రెస్ 45 సీట్లను గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనం.

దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 66 స్థానాల్లో ఎస్టీల జనాభా అధికంగా ఉన్నది. ఈ నియోజకవర్గాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల్లో ఉన్నాయి. వీటిలోని 37 స్థానాల్లో గిరిజనుల జనాభా 40 శాతానికిపైగా ఉన్నది. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లోని మొత్తం జనాభాలో ఎస్టీలు దాదాపు 60-70 శాతం ఉన్నారు. అయితే ఎస్సీ నియోజకవర్గాల మాదిరిగానే ఈ నియోజకవర్గాలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపాయి.

 2014లో ఇక్కడ 23 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ ఈ ఏడాది 22 సీట్లను గెలుచుకున్నది. అయితే 2009లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుడు ఈ నియోజకవర్గాల్లో 21 సీట్లను కైవసం చేసుకోగా.. బీజేపీ కేవలం 9 సీట్లతో సరిపుచ్చుకున్నది. గిరిజనుల జనాభా తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉన్నది. ఎస్టీల జనాభా 30-40 శాతం మేరకు ఉన్న 11 స్థానాల్లో ఈసారి 6 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎస్టీల జనాభా 20-30 శాతం మేరకు ఉన్న 18 నియోజకవర్గాల్లో 16 సీట్లను కైవసం చేసుకున్నది.