రాజధాని భూముల అక్రమాలపై జగన్ భారీ కసరత్తు

అమరావతిలో భారీ భూ కుంభకోణం జరిగిందని ఢిల్లీలో ప్రధాని మోదీని కలసిన కొద్దీ సేపటికే ఆరోపించిన కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజధాని భూముల్లో జరిగిన అవకతవకలకు వెలికితీయడానికి భారీ కసరత్తు జరపుతున్నట్లు తెలుస్తున్నది. దానిలో చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని ఆరోపించిన జగన్‌ దానిని నిరూపించడానికి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. 

దీనిలో భాగంగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జూన్‌ 8వ తేది నుండి రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటించిన డిసెంబర్‌ 8వ తేది వరకు ప్రస్తుత సిఆర్‌డిఎ పరిధిలో జరిగిన భూ లావాదేవీలపై న్యాయవిచారణ జరిపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. భూ సమీకరణ నోటిఫికేషన్‌ వెలువడిన డిసెంబర్‌ 15 వ తేది వరకు కూడా ఈ విచారణను విస్తరించే ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. 

 రాజధాని భూ సమీకరణ, కేటాయింపులు, రాజధాని పరిసర ప్రాంతాల్లో భూ యజమానుల వివరాలు ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని జగన్‌ ఆదేశించినట్లు తెలిసింది.   ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ నిరూపణ అయితే, ప్రభుత్వ రహస్యాలను బహిరంగ పరిచినందుకు గానూ సంబంధిత వ్యక్తులకు శిక్ష వేసే అవకాశం ఉంది. అయితే, భూములను వెనక్కి తీసుకునేందుకు వీలులేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చే అంశాన్ని జగన్‌ పరిశీలిస్తున్నట్లు తెలసింది. 

   న్యాయ విచారణ పరిధిలోకి క్విడ్‌ప్రోకోను కూడా తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరలకు భూములను కట్టబెట్టిన బాబు సర్కారు అదే సమయంలో ప్రభుత్వ సంస్థలనుండి ఎకరానికి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయడంలో మతలబేంటని జగన్‌ శిబిరం ప్రశ్నిస్తోంది.