ఇసుక బకాసురుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాక్షసంగా తయారయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  టీడీపీ ఎమ్మెల్యేలు బకాసురుల్లా ఇసుకను తినేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు సైతం ఈ కుంభకోణంలో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

పేదవాళ్లకు ఇసుక అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ఏపీలో నీతిలేని పరిపాలన నడుస్తోందని, వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసమే ఇసుకను టీడీపీ ఆదాయవనరుగా మార్చుకుందని ధ్వజమెత్తారు.

కాగా, టీడీపీ, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇసుక మాఫియాను వ్యతిరేకించానని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు తెలిపారు. ముఖ్యమంత్రికి  చేతకాకపోతే తనకు అధికారం ఇస్తే నెల రోజుల్లో ఇసుక మాఫియాను అరికడతామని సవాల్‌ విసిరారు. రోజురోజుకీ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించండని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అడగటంలో న్యాయముందని చెప్పారు.