మొదట కార్యకర్తను, తర్వాతే దేశ ప్రధానిని.. మోదీ

మొద‌ట‌గా తాను బీజేపీ కార్య‌క‌ర్త‌ను అని, ఆ త‌ర్వాతే దేశానికి ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధానిగా రెండో సారి ఎన్నికైన తర్వాత తనను ఎన్నుకున్న వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు సోమవారం వచ్చారు. 

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ "నాకు మీ ఆదేశ‌మే ముఖ్యం. రిలాక్స్ అయ్యే సంద‌ర్భం చాలా అరుదుగా వ‌స్తుంది.  ప్ర‌చారం, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అందుకే కేదార్‌నాథ్ వెళ్లి వచ్చాను" అని మోదీ చెప్పారు. కార్యకర్తల వల్లే  తాను ఫలితాలపై ఎలాంటి చింత లేకుండా నమ్మకంగా ఉన్నానని చెప్పారు. 

‘నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మండే ఎండలను సైతం పట్టించుకోకుండా బయటకు వచ్చి బిజెపికి ఓటేశారు. పార్టీ కార్యకర్తలు నా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఇంటి నుంచి ఒక మోదీ వచ్చి ప్రచారం చేశారు. ఏప్రిల్‌ 25న నేను కాశీ వచ్చినప్పుడు మళ్లీ నెల రోజుల దాకా వారణాసికి రాకండి అని మీరు(బీజేపీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ) చెప్పారు. ఒక బిజెపి కార్యకర్తగా మీ ఆదేశాలే నాకు ముఖ్యం"అని తెలిపారు.    

బెంగాల్‌, త్రిపురాలో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త‌మార్చార‌ని విచారం వ్యక్తం చేస్తూ సిద్ధాంతం కోసం  బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్రాణాలు కోల్పోయార‌ని గుర్తు చేశారు. వార‌ణాసిలో గెలుపు త‌న‌లో అసాధార‌ణ విశ్వాసాన్ని నింపింద‌ని అంటూ కాశీ.. శ‌క్తిని, శాంతిని ఇస్తుంద‌ని చెప్పారు. తొలుత  ఉద‌యం కాశీ విశ్వ‌నాథుడికి మోదీ పూజ‌లు చేశారు. 

రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ సరికొత్త మార్గాన్ని నిర్దేశించిందని.. 2014, 2017, 2019 ఎన్నికల్లో హాట్రిక్‌ విజయాలు సాధించడం చిన్న విషయం కాదని మోదీ అన్నారు. ఇంత జరిగినా రాజకీయ పండితుల ఇంకా కళ్లు తెరుచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లెక్కల కంటే నాయకులు, ప్రజల మధ్య బంధం ముఖ్యమని వారు ఇకనైనా తెలుసుకోవాలని హితవు చెప్పారు. 

కాశీలో పోలింగ్‌కు ముందు మోదీ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. తాను కాశీవాసినంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. సుమారు 4 ల‌క్ష‌ల‌పైగా మెజారిటీతో మోదీ వార‌ణాసి నుంచి గెలుపొందారు.