12 కొత్త జిల్లాల ఏర్పాటుకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా!

అధికారం లోకి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన 25 జిల్లాలను ఏర్పాటు చేస్తామని  ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు పదవీ బాధ్యతలు చేపట్టగానే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వేగంగా అడుగులు వేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 13గా ఉన్న జిల్లాలను 25 జిల్లాలుగా పెంచాలి. అంటే కొత్తగా మరో 12 జిల్లాలను ఏర్పాటు చేయవలసి ఉంది. 

 అయితే  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాల పునర్విభజన అంశం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేస్తారా అనే అంశంపై అధికార వర్గాలలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. త్వరలో ఒక అధ్యయన కమిటీ ని ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రణాళిక రూపొందించ వలసి ఉంది. 

13 పార్లమెంటు స్థానాలు 13 జిల్లా కేంద్రాలుగా ఉన్నాయి. మిగతా 12 మాత్రమే కొత్త జిల్లాలుగా రానున్నాయి. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా అరకు లోక్‌సభ స్థానం పరిధి ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంది. దీన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల ఇలాంటి ప్రాంతాలను దగ్గరగా ఉన్న జిల్లాల్లో విలీనం చేయాల్సి ఉంటుంది.