పాక్ ఉగ్రవాదం వీడితేనే శాంతి... మోదీ స్పష్టం

దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిర శాంతియుత పరిస్థితులు బలపడాలంటే ఉగ్రవాదానికి తావు లేని పరిస్థితులను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పరస్పరం నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలోపేతం చేయడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పాక్ ప్రధానితో మోదీ టెలిఫోన్ సంభాషణ జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 ముందుగా ఇమ్రాన్ ఖానే మోదీకి ఫోన్ చేశారని ఆ సందర్భంగా ఈ సంభాషణ జరిగిందని తెలిపింది. తనను అభినందించిన ఇమ్రాన్‌ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ పొరుగు దేశాలకు సత్సంబంధాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యత గురించి వెల్లడించారు. అంతేకాదు పేదరికాన్ని రూపుమాపేందుకు కలిసి కట్టుగా పని చేద్దామని ఈ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌కు స్పష్టం చేశారు. అయితే ఇందుకు వీలుగా ఉగ్రవాదానికి తావులేని పరిస్థితులను బలోపేతం చేయడం అవశ్యమని తేల్చిచెప్పినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ఇమ్రాన్ ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం కలిసి పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. శాంతి, ప్రగతితో పాటు దక్షిణాసియాను సుసంపన్నం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్న ఇమ్రాన్ ఖాన్ అందుకు వీలుగా భారత్ కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు మోదీకి వెల్లడించారని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. 

పుల్వామా దాడితో ఘోరంగా దెబ్బతిన్న ఇరు దేశాల సంబంధాలను గాడిలో పెట్టే క్రమంలో భాగంగానే ఇమ్రాన్‌ఖాన్ ఈ చొరవ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భారత ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే కాశ్మీర్ సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకోవచ్చన్న ఆకాంక్షను ఇటీవలే ఇమ్రాన్ వ్యక్తం చేశారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒక రోజు ముందే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు షాంఘైలో సమావేశమయ్యారు. 

ఆ సందర్భంగా భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇరు దేశాల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పుల్వామాలో భారత్ సైనికులపై జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం పాక్‌లోని బాలాకోట్‌పై భారత్ ప్రతీకారంగా వైమానికి దాడి చేయడంతో రెండో దేశాల సంబంధాలు మరింతగా క్షీణించాయి. తాజాగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం, ప్రధానుల టెలిఫోన్ సంభాషణ మళ్లీ పరిస్థితుల్లో గాడిలో పెట్టగలవన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.