నవంబర్ లోనే ఎన్నికలన్న కెసిఆర్ వాఖ్యలపై దుమారం

అసెంబ్లీని రద్దు చేసిన సమాచారం ఎన్నికల కమీషన్ వద్దకు వెళ్ళాక ముందే నవంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కె చనద్రశేఖరరావు ప్రకటించడంపై రాజకీయ దుమారం లేస్తున్నది. ఈ విషయంలో ఎన్నికల కమీషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కెసిఆర్ ఆదేసిస్తున్నారా లేదా ముందే ఎన్నికల కమీషన్ తో కూడబలుక్కొని అసెంబ్లీ రద్దుకు ఉపక్రమించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఈ విషయమై ఎన్నికల కమీషన్ తో తాను మాట్లాడానని కెసిఆర్ చెప్పడం రాజకీయ వివాదాలకు తావిస్తున్నది.

కెసిఆర్ వాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ వ్రాసారు. కెసిఆర్ పత్రికా సమావేశం యూట్యూబ్‌ లింక్‌ను జతచేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాను కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడానని, తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ అంగీకరించిందని కేసీఆర్‌ మీడియా సమావేశంలో పేర్కొన్నారని ఆ లేఖలో వివరించారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలు ఎన్నికల ప్రధానాధికారి, ఈసీ సభ్యుల పనితీరుపై సందేహాలు వ్యక్తమయ్యేలా ఉన్నాయని రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ కేసీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా కుక్డా 2015 జులైలో అప్పటి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను తన ఇంటికి పిలిపించుకుని నగరంలో స్ధిరపడిన 15 లక్షల మంది సీమాం‍ధ్ర ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారని ఆయన ఆరోపించారు.

ఓటర్ల జాబితాను కేసీఆర్‌ ఎలా తారుమారు చేస్తారనేందుకు ఇది స్పష్టమైన ఉదాహరణని శశిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేలా తాను ఈసీని ఒప్పించానని స్వయంగా  కేసీఆర్‌ వెల్లడించడంతో ఈసీ పనితీరుపైనే ఓటర్లు, మీడియా సహా ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2019 జనవరిలో ఓటర్ల తుది జాబితా ప్రచురితమవుతున్న క్రమంలో తెలంగాణలో ఈసీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందో తమకు అర్ధం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. స్వతంత్ర రాజ్యాంగ సంస్ధగా తక్షణమే కేసీఆర్‌ ప్రకటనపై వివరణ ఇవ్వాలని, ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు తెరదించాలని శశిధర్‌ రెడ్డి కోరారు. ఈసీ స్పందించని పక్షంలో ఎన్నికల వ్యవస్థ పరిరక్షణకు తాము సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.