చంద్రబాబు పాలనలో కుంభకోణాలను బైటపెడతాం!

ఆంధ్ర ప్రదేశ్ లో గత పాలనలో (చంద్రబాబు నాయుడు పాలనాలో) చాలా కుంభకోణాలు జరిగాయని ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడువై ఎస్  జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన శాఖల వారీగా రివ్యూలు చేసి అన్నింటిని బయటపెడతానని స్పష్టం చేశారు. 

రాజధాని ఎక్కడెక్కడో వస్తుందని దృష్టి మళ్లించి ప్రస్తుత రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు   అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి తర్వాత రాజధాని ప్రకటించారని జగన్‌ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు సొంత  సంస్థ హెరిటేజ్ కూడా 14 ఎకరాల భూమి కొన్నదని తెలిపారు. 

ముందుగా భూములు కొనడంతో ఆగలేదని, ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చిన ధరకు భూములు కొన్నారని, కానీ బినామీలు కొన్న భూములను మాత్రం రాజధాని ప్రాంతంలో రాకుండా జాగ్రత్త పడ్డారని పేర్కొన్నారు. రాజధాని భూముల బాగోతం ఓ సంచలనాత్మక కుంభకోణంలా బయటికి రాబోతోందని జగన్‌ వెల్లడించారు. 

తాను ఏపీకి ధర్మకర్తగా వ్యవహరిస్తా, వాస్తవాలు బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు.ఇవాళ్ట నుంచి ఆరు నెలల్లోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత శాఖలవారీగా సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలో అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం అని ప్రకటించారు. 

అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని చెబుతూ పోలవరం, రాజధాని నిర్మాణాల కాంట్రాక్టు లను పరోక్షంగా ప్రస్తావించారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉందని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తమ అభివృద్ధి నమూనా దేశానికే మార్గదర్శకంగా ఉంటుందని జగన్ చెప్పారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా పనిచేస్తానని, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాదని, పరిపాలన ఎలా సాగాలో చేసి చూపిస్తానని జగన్‌ భరోసా వ్యక్తం చేశారు. కుంభకోణాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించి ఆ సొమ్ముల్ని తిరిగి రాబట్టడమే కాదని, ఆ పనులన్నీ రద్దు చేసి ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు.

తక్కువ ఖర్చులకు పనిచేసేవారికే పనులు అప్పగిస్తామని చెబుతూ  తన మీద ఉన్న కేసులన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని జగన్‌ తెలిపారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసులు లేవని, కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాక కేసులు పెట్టారని జగన్‌ గుర్తు చేశారు. పైగా ఈ కేసులు అన్ని టిడిపి, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పెట్టినవని గుర్తు చేశారు .