జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగింది

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైకాపా అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలను జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ఈ భేటీ అనంతరం వారివురి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. జగన్‌తో జరిగిన భేటీపై మోదీ తెలుగులో ట్వీట్‌ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’’ అని మోదీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

కాగా, రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభ్యర్థించినట్లు జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన ఏపీ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించామని, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని కూడా సానుకూలంగా స్పందిస్తారని తాను భావిస్తున్నానట్లు జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి అందాల్సిన సాయం ఆలస్యం అయిందని, రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు ప్రధానికి వివరించామన్నారు.

రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు అయిదేళ్ల పాలనలో 2.57 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయని జగన్‌ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేవరకూ ప్రధానిని తాము అడుగుతూనే ఉంటామని ఆయన చెప్పారు. ఇక రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు.