ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులు కానున్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జులై 10న జన్మించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

 తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజి డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసి తనదైన ముద్రవేసిన సవాంగ్‌... గతేడాది జులై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. 

ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.  

కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రమణ్యంను కొనసాగించాలని నిర్ణయించారు. మాజీ సీఎస్ అజయ్ కళ్ళం ను ప్రభుత్వ సలహాదారునిగా నియమించనున్నారు.