కాంగ్రెస్ తో పొత్తుపై ఇరకాటంలో చంద్రబాబు

తెలంగాణ శాసనసభ రద్దు కావడంతో ముందుగా ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడటం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు పొత్తులకు సంబంధించి ఇరకాట పరిస్థితి కలిగిస్తున్నది. తెలంగాణలో సొంతంగా ఎన్నికలలు వెళ్ళే పరిస్థితులు లేకపోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో సహితం సొంతంగా పోటీచేసే ధైర్యం లేకపోవడంతో తెలంగాణలో ఏర్పరచుకొనే పొత్తుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలపై పడుతుందని భావిస్తున్నారు.

దానితో కేవలం తెలంగాణకు సంబంధించి మాత్రమె కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులను కుడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకనే గురువారం పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చంద్రబాబునాయుడు సమాలోచనలు జరిపారు.పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ విషయమై శనివారం హైదరాబాద్ లో తెలంగాణలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో అనుసరింప వలసిన వైఖరిపై స్పష్టమైన నిర్ణయం తీసుకో వలసిన అవసరం ఏర్పడింది. తెలంగాణలో ఆ పార్టీతో పొత్తుకు సిద్దపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక లోక్ సభ సీట్, పది అసెంబ్లీ సీట్లు మాత్రమె ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తున్నది. మరో నాలుగైదు అసెంబ్లీ సీట్ల కోసం బెరాలాడినా, మరో లోక్ సభ సీట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో కే ఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్ మంత్రులు కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకిస్తూ ఘాటైన విమర్శలు చేసారు. తెలంగాణలో పొత్తుకు వారికి అభ్యంతరం లేకపోయినా, ఆంధ్ర ప్రదేశ్ లో కుడా పొత్తుకోసం చంద్రబాబునాయుడు ఆలోచన చేస్తున్నారు. అయితే డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తిని, బిజెపి కోలుకొంటే కాంగ్రెస్ తో చేతులు కలపడం చంద్రబాబునాయుడుకు రాజకీయంగా ఆత్మహత్య సాదృశ్యం కాగలదు. అందుకనే ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో సీపీఐ, సిపిఎం,  ప్రొఫెసర్‌ కోదండరాం నెలకొల్పిన తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) పార్టీలతో పొత్తు పట్ల కాంగ్రెస్, టిడిపి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే రెండు వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చేతులు కలుపుతున్నాయి. తెలంగాణతో కుడా ఆ పార్టీతో పొత్తు కోసం సిపిఎం కసరత్తు చేస్తున్నది. కేవలం సిపిఐ మాత్రమె కాంగ్రెస్, టిడిపిలతో తెలంగాణలో చేతులు కలపడానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.

ఇప్పటికే 20 సీట్లలో అభ్యర్ధులను ప్రకటించిన కోదండరామ్ సహితం పొత్తుల విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడి చేయడం లేదు. ఇప్పటికే తెలంగాణలోని టిడిపి నాయకులు పొత్తుల విషయంలో ఇతరులతో సమాలోచనలు జరుపుతున్నారు. రెండు కాళ్ళ సిద్దంతంతో ప్రఖ్యాతి వహించిన చంద్రబాబునాయుడు సహితం కాంగ్రెస్ తో పొత్తు విషయంలో ఆ సిద్దంతాన్నే తిరిగి తెరపైకి తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. `ప్రజల కోర్కె మేరకు’ తెలంగాణలో కాంగ్రెస్ తో కలుస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఎపిలో మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ కు దూరంగా ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

కెసిఆర్ ప్రధాని మోడీ కన్నుసంనలతో నడుస్తున్నారని చెప్పడం ద్వారా మోడికి వ్యతిరేకంగా కెసిఆర్, బిజెపిలను వ్యతిరేకించే అన్ని పార్టీలను కలుపుకు వెళ్ళాలని చెబుతూనే పొత్తుల విషయంలో తెలంగాణకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా కాంగ్రెస్ తో చేతులు కలపడం స్థానిక పరిస్థితుల కారణంగా తెలంగాణ టిడిపి నాయకులు తీసుకున్న నిర్ణయమని, దానితో తనకు సంబంధం లేదని చంద్రబాబు చెప్పడానికి కుడా వెనుకాడక పోవచ్చు.