ఏపీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ... కేసీఆర్ భరోసా

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం తమ విధానమని,   ఆంధ్రప్రదేశ్‌తో కూడా అదే పంథాను అవలంబిస్తామని తెలంగాణముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రగతి భవనంలో సాదరంగా స్వాగతం పలుకుతూ  ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని.. అనూహ్య విజయం సాధించినందుకు హృదయపూర్వకంగా అభినందించారు.

"నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు మధ్య ఉన్న జలవివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై మాట్లాడాను. సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిన చర్చలు ఫలించాయి. వివాదాల పరిష్కారానికి మహారాష్ట్ర ముందుకు వచ్చింది. దీంతో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నాం"అని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.   

రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం అని వైఎస్ జగన్‌తో సీఎం అన్నారు. గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం గరిష్ఠంగా 700 నుంచి 800 టీఎంసీలను మాత్రమే వాడుకునే అవకాశమున్నదని తెలిపారు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే వీలుందని చెప్పారు. 

ప్రకాశం బరాజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించి, రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని, కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు.