ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌కు గవర్నర్‌ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయాలని గవర్నర్‌ నరసింహన్‌ వైకాపా శాసనసభాపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. వైకాపా సీనియర్‌ నేతలు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తమ శాసనసభాపక్ష నేతగా జగన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఏపీలో  ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కోరారు. 

జగన్‌ తన సతీమణి భారతితో కలిసి శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నర్‌ నరసింహన్‌, ఆయన సతీమణి విమలా నరసింహన్‌ దంపతులను కలిశారు. వైకాపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జగన్‌ను ఈ సందర్భంగా గవర్నర్‌ అభినందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి అనుగుణంగా రాజ్‌భవన్‌ అధికారులు లేఖను అందజేశారు. 

ఈ నెల 30న మధ్యాహ్నం 12.23కి విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జగన్‌ తెలిపారు. అంతకుముందు గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, సహాయ కార్యదర్శి అర్జున్‌రావు, సిబ్బంది జగన్‌ దంపతులకు స్వాగతం పలికారు. విమలా నరసింహన్‌ వైఎస్‌ భారతికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. దాదాపు 40 నిమిషాలపాటు రాజ్‌భవన్‌లో జగన్‌ గడిపారు. వివిధ అంశాలపై చర్చించారు. 

జగన్‌ వెంట  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌ తదితరులు ఉన్నారు.