మున్సిపల్‌ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం

ఈ నెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు వేదికను ఖరారు చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 

మొత్తంగా 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. 

తొలుత చినఅవుటపల్లి జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఓ ప్రాంతంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు భావించినప్పటికీ.. వైఎస్‌ జగన్‌ మాత్రం విజయవాడలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 ప్రధానంగా మున్సిపల్‌ మైదానంలోకి వచ్చిన రహదారులు, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఇతర వీవీఐపీలంతా హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.