బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జంషెడ్‌పూర్‌కు ఆగేయంగా 140 కిలోమీటర్ల దూరంలో, కియాంజిర్‌గఢ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైందని పేర్కొన్నారు.

రాగల 24 గంటల్లో క్రమేణా బలహీనపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. గడచిన 24 గంటల్లో సోంపేట, కళింగపట్నంలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.