ఎన్నికల్లో ఘోర వైఫల్యంపై కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనికి బాధ్యత వహిస్తూ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ అధ్యక్షులు రాజీనామాల బాట పడుతున్నారు. యుపి పిసిసి అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ సహా ముగ్గురు పిసిసి ఛీఫ్‌లు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తమ రాజీనామా లేఖలను పంపించారు.

 ' ఫలితాలు చాలా నిరాశకు గురిచేశాయి. ఇది పార్టీకి తీరని నష్టం' అని రాజ్‌బబ్బర్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన ఫతేపూర్‌ సిక్రీ స్థానంలో ఓటమి పాలయ్యారు. 
ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శనివారం భేటీ కానుంది. ఈ సమావేశం అనంతరం రాహుల్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 

కాంగ్రెస్‌ పార్టీ తరపున రాహుల్‌ గాంధీ అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అతనికి తోడుగా సోదరి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వీరు ఓటర్ల మనసు గెలుచుకోవడంలో విఫలయ్యారు.. అఖరుకు గాంధీ కుటుంబానికి పట్టుండే ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో కూడా రాహుల్‌ ఓటమి పాలయ్యారు. 

మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో బిజెపి 300 స్థానాలకు పైగా గెలుచుకోగా, కాంగ్రెస్‌ పార్టీ 52 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కర్నాటక ప్రచారకర్త హెచ్‌కె పాటిల్‌, ఒడిషా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ తమ రాజీనామాలను కాంగ్రెస్‌ అధిష్టానికి పంపించారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. 

ఇక ప్రియాంక గాంధీ విసృత ప్రచారం నిర్వహించినా పార్టీ ఉత్తరప్రదేశ్‌లో కూడా ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మాత్రమే గెలుపొందారు.