దళితులను పట్టించుకోని కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రయోజనం కల్పించే ఏ పని చేయలేదని, దళితుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని బీజేపీ అద్యక్షుడు అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి దళితులకు వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దళితుల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించే స్థాయి, అర్హత కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేసారు. ఇటువంటి విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన కోరుతూ  ట్వీట్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ చట్టానికి పదును పెట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని షా గుర్తు చేసారు. బీసీల సంక్షేమం కోసం ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేశామన్నాని చెబుతూ ఈ కమిషన్‌ను రాజ్యాంగ ప్రతిపత్తి కుడా కల్పించామని తెలిపారు. దళితులను, ఓబీసీలను అవమానించడం తప్ప మరొక పని కాంగ్రెస్‌కు లేదని దయ్యబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ చట్టాలను కఠినం చేసిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీల అన్యాయం జరుగుతుందనే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని పటిష్టంచేశామని, రాజ్యాంగ సవరణలు తెచ్చామని వివరించారు.  దళితుల రక్షణకు మరిన్ని అంశాలను పొందుపరిచామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల తరబడి దేశాన్ని పాలించిందని, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రాం, సీతారాం కేసరి లాంటి మహనీయులకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని అంటూ వారిని అవమానపరిచిందని విమర్శించారు.

ఉద్యోగాల్లో పదోన్నతుల అంశానికి కాంగ్రెస్ పార్టీ గతంలో మద్దతు ఇవ్వలేదని అమిత్ షా గుర్తు చేసారు. అంబేద్కర్ జీవితంలో ప్రధాన ఘట్టాలు చోటు చేసుకున్న ఐదు ప్రదేశాలను కలిపి పంచతీర్థ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఘనత తమకే దక్కుతుందని తెలిపారు.