బెంగాల్‌లో మమతా కోటలను బద్దలు చేసిన బీజేపీ

పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ కోటలను బిజెపి బద్దలు చేసింది. దేశం అంతా సాధించిన విజయం ఒక వంతయితే ప్రస్తుత ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ లో 18 సీట్లను గెల్చుకోవడమే కాకుండా, ఆ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ లను మట్టి కురిపించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి, మమతకు నిద్రలేని రాత్రులకు కారణమయ్యారు. 2014 ఎన్నికలలో బిజెపి ఇక్కడ కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకోవడం గమనార్హం. 

గత ఫలితాలతో పోల్చితే తృణమూల్‌ కాంగ్రెస్‌ 12 స్థానాలను కోల్పోయి 22కి పరిమితమైంది. కాంగ్రెస్‌ రెండు స్థానాలు కోల్పోయి రెండింటికి పరిమితం అవగా.. సీపీఎం ఉన్న 2 స్థానాలూ కోల్పోయింది. గత ఐదేళ్లలోనే బీజేపీ రాష్ట్రంపై పట్టు బిగించి,  మమతా బెనర్జీకి తట్టుకోలేని షాక్‌ ఇచ్చింది. 

పశ్చిమబెంగాల్‌.. ఒకప్పుడు వామపక్షాల కంచుకోట. దాదాపు 34 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించారు. అయితే 8 ఏళ్ల క్రితం తృణమూల్‌ కాంగ్రెస్‌ రూపంలో వారి ఆధిపత్యానికి అడ్డుకట్టపడింది. ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ 2011లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి కమ్యూనిస్టుల వరుస విజయాలకు చెక్‌ పెట్టారు. అనంతరం 2016లో జరిగిన ఎన్నికల్లోనూ తృణమూల్‌ విజృంభించింది. మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 211 స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి దీదీ ముఖ్యమంత్రి అయ్యారు.

కానీ, తాజా సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి.. దీదీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తన పార్టీ ఎంపీలను విజయతీరాలకు చేర్చడంలో దీదీ చతికిలపడ్డారు. కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి.  నిజానికి బిజెపికి పశ్చిమబెంగాల్‌లో మిగిలిన పార్టీలతో పోల్చితే చెప్పుకోదగిన కేడర్‌ లేదు. గతంలో పార్టీ తరఫున నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులే కరవయ్యేవారు. అందువల్ల చాలా నియోజవర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తూ వచ్చారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు కూడా ఈ మధ్యే ఏర్పాటు చేస్తున్నారు. "బిజెపికి రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ లేదు. కానీ బలం ఉంది... రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలపాటు పాలించిన కామ్యూనిస్టులకు వ్యవస్థ ఉంది.. కానీ, బలం లేదు. అందువల్ల రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓడించాలంటే కచ్చితంగా బిజెపికే ఓటు వేయండి’’ అని కమ్యూనిస్టు మాజీ నేత ఒకరు చెప్పారు. దీనిని బట్టి తృణమూల్‌ను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టుల మద్దతు దారులకు సహితం బిజెపి తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. 

 రాష్ట్రంలో ఇటీవల కాలంలో తృణమూల్‌పై వ్యతిరేక పవనాలే వీచాయని చెప్పాలి. వివిధ సందర్భాల్లో చెలరేగిన మత ఘర్షణలను అణచివేయడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  విఫలమయ్యారనే వాదనలు వెల్లువెత్తాయి. ఫలితంగా ప్రభుత్వంపై అసమ్మతి పెరిగిపోయింది. దీనికి తోడు ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ, అధికార పక్షాన్ని నిలదీయడంలో విఫలమైంది. ఇవి కూడా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు  దారితీసింది. 

 దీనికి 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికలే ఉదాహరణ. దాదాపు 34 శాతం స్థానాల్లో ప్రతిపక్ష వామపక్ష కూటమి  అభ్యర్థులు పోటీయే చేయలేదు. ఫలితంగా భాజపా రాష్ట్రంలో రెండో స్థానానికి ఎగబాకింది. చాలా కాలం నుంచి వామపక్షాలకు మద్దతు పలుకుతూ వచ్చిన ఓటర్లకు బిజెపి రూపంలో మరో ప్రత్యామ్నాయం లభించింది.  ఎన్ని సంవత్సరాలు గడిచినా తృణమూల్‌ను ఎదిరించే సత్తా సీపీఐ(ఎం) నాయకులకు లేదని భావించిన వారంతా..ఈ సారి బిజెపి వైపు మొగ్గు చూపారు.