కాంగ్రెస్ కు మరో సారి ప్రతిపక్ష హోదా దక్కదా!

సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనానికి కాంగ్రెస్‌ కుదేలై కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. 2014తో పోలిస్తే స్వల్పంగా పుంజుకున్నప్పటికీ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన పార్టీకి ఈ ఫలితాలు పరాభవమనే చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఈసారి కూడా అదే పరంపరను కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రతిపక్ష నాయకుడిగా అర్హత సాధించాలంటే లోక్‌సభలో కనీసం 10శాతం అంటే 55 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌ 52 సీట్లకే పరిమితమవడంతో దాదాపు ఆ ఆశలు గల్లంతయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి  రాగానే.. రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించింది. నిబంధనల మేరకు సరిపడా సీట్లు సాధించని కారణంగా ప్రతిపక్ష పార్టీ అర్హత కాంగ్రెస్‌కు ఇవ్వలేమని అప్పట్లో వివరించింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. పలు ఎంపిక కమిటీల్లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర అనివార్యమవడంతో కాంగ్రెస్‌కు ఆ హోదాను ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. 

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌, లోక్‌పాల్‌, సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక బృందంలో ప్రతిపక్ష నాయకుడు తప్పనిసరి. ఈ విషయాన్ని అప్పట్లో స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌కు వివరించినప్పటికీ.. ఆమె కూడా సాంప్రదయాలు, అటార్నీ జనరల్‌ సలహాల పేరుతో కాంగ్రెస్‌ డిమాండ్‌ను తిరస్కరించారు. అయితే మల్లికార్జున ఖర్గేను ఎంపిక బృందాల్లో చేర్చారు. అయినా ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించడానికి మాత్రం అంగీకరించలేదు.