విశాఖ ఉత్తర ఫలితంపై వివాదం !

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏయూ ప్రాంగణంలో గురువారం రాత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇక్కడ నుంచి టిడిపి  అభ్యర్థిగా మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈ సమయానికి ఆయన రెండువేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  

అయితే ఆ వీవీప్యాట్లకు సంబంధించిన ఓట్లను కేకే రాజుకు కలిపినా కూడా.. గంటా శ్రీనివాసరావుకే ఆధిక్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఈసీని సంప్రదించి ల తర్వాత గంటా విజయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించి ఉత్కంఠతకు తెరదించారు. 

ఈ కేంద్రంలో తొలుత కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ కారణంగా రౌండ్ల లెక్కింపునకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలను మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాటిని పక్కనపెట్టి తర్వాతి రౌండ్ల లెక్కింపును కొనసాగించారు. ఇలా సుమారు ఆరు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తేలింది. 

మొత్తం రౌండ్లు పూర్తయ్యాక, మొరాయించిన ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్లను లెక్కించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైసిపి  అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టడంతో పాటు నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. 

వీవీప్యాట్‌లో చోటుచేసుకున్న లోపాల మీద అధికారులు సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతోవైసిపి శ్రేణులు లెక్కింపు కేంద్రం బయటే నిరసనకు దిగారు.ఇబ్బంది కలిగిన పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని వైసిపి  నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ నిర్ణయం తీసుకోనున్నారు.