జమ్ముకశ్మీర్‌ డీజీపీపై వేటు

జమ్ముకశ్మీర్‌ డీజీపీ ఎస్పీ వేద్‌పై వేటు పడింది. పోలీసు శాఖలో ఉన్నతస్థాయి అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. కేంద్రంతో విభేదాల కారణంగానే వేద్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది. ముష్కరులు కిడ్నాప్‌ చేసిన పోలీసు అధికారుల కుటుంబసభ్యులను విడిపించేందుకు పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదులను గత వారంలో విడుదల చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో డీజీపీపై వేటు పడటం గమనార్హం. వేద్‌ స్థానంలో జైళ్ల శాఖ డీజీ దిల్బాగ్‌ సింగ్‌కు ఇంఛార్జ్‌ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే కీలకమైన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అబ్దుల్‌ గనీ మిర్‌ను కూడా బదిలీ చేశారు.

గత వారం దక్షిణ కశ్మీర్‌లో ముగ్గురు పోలీసు అధికారులు, ఎనిమిది మంది వారి బంధువులను ఉగ్రవాదులు అపహరించారు. పోలీసుల చెరలో ఉన్న ఉగ్రవాదులను వదిలేస్తేనే వీరిని వదిలిపెడతామని ముష్కరులు డిమాండ్‌ చేశారు.

దీంతో పోలీసుల చెరలో ఉన్న దాదాపు 12 మంది ఉగ్రవాదులను వదిలిపెట్టారు. వీరిలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూ తండ్రి కూడా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర హోంశాఖ విభేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీజీపీని తప్పించినట్లు చెబుతున్నారు.