టిడిపికి చరిత్రలో కని, విని ఎరుగని పరాభవం

ఫ్యాను గాలి తుఫాన్‌గా మారడంతో కొట్టుకుపోయిన సైకిల్.. 23 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ ఎదురులేని శక్తిగా నిలిచింది. మొత్తం 25 ఎంపీ సీట్లకుగాను ఏకంగా 22 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన ఒకేఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను మించి వైసీపీ సీట్లు గెలవడం విశేషం. 

వైసీపీ ఏకంగా నాలుగు  జిల్లాల్లో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండాచేసింది. కర్నూలు జిల్లాలో 14, కడప జిల్లాల్లో 10, నెల్లూరులో పది, విజయనగరంలో తొ మ్మిది స్థానాలకుగాను అన్నింట్లోనూ ఫ్యాను గాలి వీచింది. పలుజిల్లాల్లో టీడీపీ ఒక్కొక్క స్థానానికే పరిమితమయింది. 2014లో రా యలసీమలోనే మెరుగైన స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈసారి ఉత్తరాంధ్ర, కోస్తాలోనూ టీడీపీకి అందనంత స్థాయిలోకి వెళ్లింది. కు ప్పంలో గతఎన్నికల్లో 47వేలపైచిలుకు మెజార్టీతో గెలిచిన చంద్రబాబు.. ఈసారి 30,722 ఓట్ల మెజార్టీకి తగ్గిపోవటం గమనార్హం.   

తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేసిన పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. మార్పు కోసమంటూ విస్తృత ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. పొత్తు పెట్టుకున్న వామపక్షాలు సైతం ఉనికిలో లేకుండాపోయాయి. 

చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సభ్యులలో కుమారుడు నారా లోకేష్ తో పాటు ముగ్గురు తప్ప అందరూ ఓటమి చెందారు. రాజకీయ వారసులుగా పోటీ చేసిన పలువురు యువనేతలకు సహితం ఓటమి తప్పలేదు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇంతటి ఘోర పరాజయం ఎన్నడూ ఎదురు కాలేదు. 

పొత్తులు లేకుండా మొదటి సారి తెలుగు దేశం పార్టీ పోటీ చేయడం ఒక కారణమైతే, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీతో చెట్టపట్టాలు వేసుకొని తిరగడాన్ని ప్రజలు సహించలేక పోయారని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 

రాష్ట్రంలో హద్దుమీరిన అవినీతి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల దౌర్జన్యా లు, రాజకీయంగా చంద్రబాబు స్వయంకృతాపరాధాలు టీడీపీని కోలుకోని రీతిలో దెబ్బతీశాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇసుక మాఫియా, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి, రాజధాని నిర్మాణంలో అధికారపార్టీ నేతల భూదందాలను ప్రజలు గ్రహించారని అంటున్నారు. దీనికితోడు గాడితప్పిన పాలన, ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం ప్రజలను విసుగెత్తించాయని పేర్కొంటున్నారు. 

అన్నింటికి మించి నాలుగేండ్లపాటు ఎన్డీఏతో అంటకాగి.. అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరిగి, ఎన్నికలకు కొద్ది నెలల ముందు బయటకు వచ్చి హైడ్రామాకు తెరతీయడం ఆ పార్టీ ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది.   

ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన నేపథ్యం లో కొత్త ఏపీ అభివృద్ధికి ఆ రాష్ట్ర సీఎంగా అవసరమైనచర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు.. ఆ పనిని పక్కనపెట్టి నిత్యం తెలంగాణతో ఘర్షణపూరిత వైఖరిని అనుసరిస్తూ వచ్చారు. 

మాట్లాడితే హైదరాబాద్‌ను తానే సృష్టించానని, అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్రస్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్పించి.. కొత్త రాజధాని అమరావతికి ఒక రూపు తీసుకువద్దామన్న ఆలోచనే లేకుండా పోయింది. అన్నీ తాత్కాలిక భవనాలతో నడుపుకొచ్చిన చంద్రబాబు తీరు ప్రజల్లో అపనమ్మకం కలిగించిందని  వెల్లడి అవుతుంది.  

ప్రజాసంక్షేమమంటే కేవలం ఎన్నికల ముందు ఓట్ల కొనుగోలు పథకాలుగా చంద్రబాబు భావించారనే విమర్శలున్నాయి. అందుకే ఐదేండ్లకాలంలో నాలుగున్నరేండ్లు పాలనను గాలికొదిలి, చివరి ఐదారునెలల్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేందుకు ప్రయత్నించారు. 

పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి వంటి వాటికింద వేల కోట్లు పంపిణీ చేసి.. ఓట్లను కొనుగోలుచేయాలని చూశారు. కానీ.. ఈ పథకాల వెనుక పథకాన్ని గమనించిన ప్రజలు.. దానిని ఎన్నికల జమ్మిక్కుగానే గ్రహించి అదునుచూసి దెబ్బకొట్టారు. వైసీపీ విజయంలో మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు వేయడం కూడా కీలకంగా మారిందని అంటున్నారు.