తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కు శృంగభంగం, బిజెపి పాగా

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీట్ కే పరిమితమైన బిజెపి ఈ పర్యాయం నాలుగు లోక్ సభ స్థానాలను గెల్చుకొని అపూర్వ విజయం సాధించింది.  డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని, అన్ని సీట్లను గెల్చుకొంటామని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ నాయకత్వంకు శృంగభంగం తప్పలేదు.   

మొత్తం 17 స్థానాల్లో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 10 స్థానాల్లో అధికార పక్షం గెలుపొందింది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 41.30% ఓట్లను టీఆర్‌ఎస్ సొంతం చేసుకున్నది. కాంగ్రెస్ 29.50%, బీజేపీ 19.40% ఓట్లను దక్కించుకున్నాయి.  

బిజెపి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాలను  గెల్చుకొంది.  20 ఏళ్ల తర్వాత తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందడం.. అదికూడా ఈ సారి ఒంటరిగా బరిలో దిగి జయభేరి మోగించడంతో కమలదళంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. 

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో 71,057 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 

కరీంనగర్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ, పార్టీ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌.. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ చేతిలో 89,508 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ జి.నగేశ్‌పై.. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు 58,493 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక సికింద్రాబాద్ లో బిజెపి నేత జి కిషన్ రెడ్డి 62 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 

ఓటమిపాలైన పలు స్థానాల్లో కూడా బిజెపి భారీ ఎత్తున ఓట్లు సాధించింది. మహబూబ్‌నగర్‌లో డి.కె.అరుణ, మల్కాజిగిరిలో రామచంద్రరావు మూడు లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు. హైదరాబాద్‌ అభ్యర్థి భగవంతరావు, మెదక్‌ అభ్యర్థి రఘునందన్‌రావుకు రెండు లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. జహీరాబాద్‌, చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లో దాదాపు లక్షన్నర ఓట్ల చొప్పున బిజెపి అభ్యర్థులకు వచ్చాయి.   

అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర ఫలితాలతో రోజురోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలిచిన కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో 3 స్థానాలను గెలుచుకుంది. నల్లగొండ నుంచి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై గెలుపొందారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఇద్దరు పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఎ.రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటారు. భువనగిరి నుంచి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలుపొందారు. మల్కాజ్‌గిరి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డిపై ఎ.రేవంత్‌ రెడ్డి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.