మోదీపై రాహుల్ విమర్శలను తిప్పి కొట్టిన దేశ ప్రజలు

రాఫెల్ మొదలుకొని చౌకీదార్ చోర్ వరకూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ చేసిన విమర్శలను జనం అస్సలు పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.  శతాధిక వత్సరాల కాంగ్రెస్ పార్టీకి అతి పిన్న వయస్కుడిగా అధ్యక్ష బాధ్యతలు అందిపుచ్చుకున్న రాహుల్ గాంధీ మ్యాజిక్ ఏదీ లోక్‌సభ ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రధాని నరేంద్రమోదీకి ఏకైక బలమైన ప్రత్యర్థిగా జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకునేందుకు రాహుల్ విసిరిన మహాఘట్ బంధం పాచికలు పారలేదు. 

కాంగ్రెస్ సారధ్యంలోని ఈ కూటమితో చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీలన్నింటికీ మోదీ ప్రభంజనం ముచ్చెమటలు పోయించింది. మోదీని దెబ్బతీసేందుకు ఆయనపై రాహుల్ గాంధీ చేయని విమర్శలేదు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మొదలుకొని అనేక ఇతర అంశాలపైనా మోదీని వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇరకాటంలో పడేసేందుకు రాహుల్ ఎంతగా ప్రయత్నించినా ఇటు కాంగ్రెస్ పార్టీని గానీ అటు ఆ పార్టీ సారధ్యంలోని ప్రాంతీయ పార్టీల కూటమినిగానీ జనం నమ్మలేదు. 

కాంగ్రెస్ కూడా సొంతంగా ఎక్కువ సీట్లకు పోటీ చేయక పోవడం అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం మీదే నమ్మకాన్ని పెట్టుకోవడం వల్ల దేశ ప్రజలు వేటినీ నమ్మకుండా సుస్థిర ప్రభుత్వానికే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు.  ఈ ఎన్నికల్లో రాహుల్ జనాకర్షక శక్తి ప్రజలను కదిలించలేకపోయిందన్న విషయం స్పష్టమవుతోంది.

 ప్రియాంక గాంధీని చివరి క్షణంలో రంగంలోకి దింపినా అతిపెద్ద రాష్టమ్రైన యూపీలోనే కాదు రాహుల్ చాలా బలంగా నమ్ముకున్న ప్రాంతీయ పార్టీల కూటమి కూడా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేక పోయింది. రాహుల్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అసలు కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతుందా? అన్న అనుమానాలకు ఈ ఫలితాలు ఆస్కారాన్ని ఇస్తున్నాయి. రాహుల్ నాయకత్వ పటిమకు సంబంధించి అనుమానాలకు తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. 

అన్ని ప్రాంతీయ పార్టీలను కూడగట్టినా రాహుల్ గాంధీ ఆశించిన స్థాయిలో మోదీని ఏమాత్రం ఎదుర్కోలేకపోయాంటే సహజంగానే కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన పట్ల విమర్శలకు ఆస్కారం ఏర్పడుతుంది.అనూహ్యమైన, అనితర సాధ్యమైన మెజారిటీతో కేంద్రంలో కొలువుదీరనున్న మోదీ సర్కార్‌ను అరకొర సీట్ల బలంతో ప్రతిపక్షాలు ఏమేరకు అడ్డుకోగలుగుతాయన్నది ప్రశ్నార్ధకమే.