టీఆర్‌ఎస్‌ కు షాక్ ... .నాలుగు సీట్లలో బిజెపి విజయం

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఫుల్‌జోష్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు గట్టి షాక్‌ ఇచ్చాయి. సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు అంటూ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆ పార్టీకి  ఊహించనిరీతిలో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయురాలైన కవిత నిజామాబాద్‌ స్థానంలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో 68 వేలపై చీలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు. 

ఇక, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బీ. వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ చేతిలో ఓటమిని చవిచూశారు.  బండి సంజయ్‌ 89,508 ఓట్ల తేడాతో సంజయ్ విజయం సాధించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ, గత ఎంపీ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసి ఓడిపోయారు. దీంతో బండి సంజయ్‌పై జిల్లాలో సానుభూతి ఏర్పడింది. బండి సంజయ్ విజయంతో కమలనాథులు పండగ చేసుకుంటున్నారు.

కాగా ఆదిలాబాద్ లో సోయం బాబురావు, సికింద్రాబాద్ లో జి కిషన్ రెడ్డి కూడా బిజెపి అభ్యర్థులుగా గెలుపొందారు. 

ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ.. బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొందడం గమనార్హం. నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లాంటి టీఆర్‌ఎస్‌ కంచుకోటలను బద్దలు కొట్టడమే కాదు.. సికింద్రాబాద్‌లో సైతం బీజేపీ గెలుపుదిశగా సాగుతోంది. 

మరోవంక   కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా తెలంగాణలో నాలుగు స్థానాలు కైవసం చేసుకునే దిశగా సాగుతుండటం గమనార్హం. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విజయం సాధించగా.. చెవేళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు.  

16 సీట్లలో  గెలుస్తామని చెప్పుకున్న టీఆర్‌ఎస్‌ ఎనిమిది  సీట్లకు పరిమితం కావలసి వచ్చింది.