టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫీవర్ మరింత ఊపందుకుంది. దీంతో ఇప్పటికే 105 అభ్యర్థుల పేర్లు ప్రకటించిన టీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో గెలుపు గుర్రాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేష్ రెడ్డి అధికార పక్షంలో చేరారు. ఆయనతో మంత్రి కే టి రామారావు భేటి అయి తమ పార్టీలో చేరమని ఆహ్వానించారు. కేటీఆర్‌ ఆహ్వానం మేరకు తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సురేశ్‌రెడ్డి ప్రకటించారు.

టీఆర్ఎస్ పాలనలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవాన్ని చూశానని తెలిపారు. తెలంగాణకు ఇప్పుడు అత్యంత కీలకమైన సమయమని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నదే తన అభిప్రాయమని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. సురేశ్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

సురేష్‌ రెడ్డి నాలుగు సార్లు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2004 నుండి 2009 వరకు వై ఎస్ రాజశేఖరరెడ్డి హయంలో శాసన సభ స్పెకర్ గా వ్యవహరించారు. అయితే బాల్కొండ నుంచి ఆర్మూర్‌  నియోజకవర్గానికి మారి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలోనే ఆయన అధికార పక్షంలో చేరుతున్నట్లు కధనాలు వెలువడినా తాను కాంగ్రెస్ ను విడిచే ప్రసక్తి లేదని, తమది కాంగ్రెస్ కుటుంభం అంటూ సురేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.