ఈనెల 30న సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైసిపి దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 30న జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. 

ఎల్లుండి వైసిపి  శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టి ఓట్లు పొందాలని చూశారని, అయినా ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదని ఉమ్మారెడ్డి విమర్శించారు.  

 సీఎం కేసీఆర్.. వైఎస్ జగన్‌కు ఫోన్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్భుత విజయం సాధించినందుకు కేసీఆర్.. జగన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడంతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు.  ‘ఎన్నికల్లో విజయం సాధించినందుకు వైఎస్‌ జగన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు పడిన కష్టానికి ప్రజల ఆశీర్వాదం రూపంలో మంచి ఫలితం దక్కింది. తెలంగాణకు సోదరిలాంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మీరు చక్కగా పాలిస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.