ఓటమి భయంతోనే ఈవీఎంలపై అనుమానాలు

ఈవీఎంలపై లేనిపోని అనుమానాలు లేవనెత్తడం ద్వారా ప్రజాతీర్పునే అగౌరవ పరుస్తున్నాయంటూ బిజెపి  అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపించారు. ఓటమి  భయంతోనే విపక్షాలు ఈవీఎంలపై విమర్శలకు దిగుతున్నాయంటూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. పోలింగ్‌ ఆరోదశ తర్వాతి నుంచే ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు లేవనెత్తడం మొదలైందనీ...ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత విమర్శలు మరింత ఉధృతమైనాయన్నారు. అసలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారంటూ  అమిత్‌ షా సూటిగా అడిగారు.  

ఈవీఎంలను వ్యతిరేకించటం అంటే దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును తిరస్కరించటమేనని  ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏ మరోసారి అధికారంలోకి వస్తున్నట్లు తెలియగానే ప్రతిపక్షాలు మరోసారి ఈవీఎంలపై దాడి చేయటం విచిత్రంగా ఉన్నదని చెప్పారు. ప్రతిపక్షాలు విజయం సాధించినప్పుడు ఈవీఎంల టాంపరింగ్ జ్ఞాపకం రాకపోవటం ఏమిటని ప్రశ్నించారు. 

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లలో 67 సీట్లు ఎలా వచ్చాయి? ఈవీఎంలను టాంపరింగ్ చేసేందుకు వీలుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు అధికారం చేపట్టింది? అని అమిత్ షా ట్వీట్ చేశారు. 2017లో ఈవీఎంలపై దాడి ప్రారంభమైనప్పటి నుండి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయటం తెలిసిందే. ఈవీఎంలపై దాడి చేస్తున్న ప్రతిపక్ష నాయకుల్లో అరవింద్ కేజ్రీవాల్ మొదటి వరుసలో ఉంటున్నారు. ఈవీఎంలను టాంపరింగ్ చేయవచ్చంటూ గత మూడేళ్ల నుండి గొడవ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు కేజ్రీవాల్ మొదటి నుండీ మద్దతు ఇవ్వటం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్వీట్స్‌లో అరవింద్ కేజ్రీవాల్‌పై మొదటగా దాడి చేయటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నుండి ప్రతిపక్షాలు ఈవీఎంలను ప్రశ్నించటం ప్రారంభమైంది. ఈవీఎంలను టాంపర్ చేయటం వల్లే ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రతిపక్షాలు అప్పటి నుండీ ఈవీఎంలను బీజేపీ టాంపర్ చేస్తోందని ఆరోపించటం తెలిసిందే. ఈవీఎంలను టాంపర్ చేసి చూపించాలన్న సవాల్‌ను ప్రతిపక్షాలు ఎందుకు స్వీకరించలేదని ఆయన నిలదీశారు.

ఓటమి ఎదురు కావటంతో 22 ప్రతిపక్షాలు ఈవీఎంలపై దాడి చేస్తున్నాయని అమిత్ షా దుయ్యబట్టారు. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు లెక్కింపు విధానాన్ని సవరించాలంటే ఎలా సాధ్యమవుతుంది? ప్రతిపక్షాలు ఆలోచించవా అని అమిత్ షా ప్రశ్నించారు. ఈవీఎంలను టాంపర్ చేయటం ద్వారా ఓట్లు దోచుకుంటే రక్తం పారుతుందంటూ ఉపేంద్ర కుష్వాహ చేసిన హెచ్చరికను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వారు కోరుకున్నట్లు ఓట్లు పడకపోతే హింసకు పాల్పడతారట.. ఇదా వీరి ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు.

 ప్రతిపక్షాలు ఈవీఎంలను ప్రశ్నించటం ద్వారా ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న సుప్రీం కోర్టును తప్పుపడుతున్నారా? అని అమిత్ షా నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల ఆరోదశ పోలింగ్ పూర్తయినప్పటి నుండి ప్రతిపక్షాలు ఈవీఎంలపై గొడవ ప్రారంభించాయని ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా మీరు ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బీజేపీ అధ్యక్షుడు నిలదీశారు. 

పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.. గతంలో ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో గొడవ, హింస చోటుచేసుకున్నది.. ఇప్పుడు మా త్రం అలాంటిదేదీ జరగలేదు.. దానికి ప్రతిపక్షం సంతోషించకుండా గొడవ చేయటం ఏమిటని అమిత్ షా అడిగారు. ప్రతిపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించటం ద్వారా దేశంలోని తొంభై కోట్ల మంది ఓటర్లను అగౌరవపరుస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.