కర్ణాటక కాంగ్రెస్ లో ఎగ్జిట్‌ పోల్స్‌ 'కలకలం'

 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్‌ వెలువడిన నేపధ్యంలో కర్ణాటకలో మరో 'రాజకీయ కల్లోలం' మొదలైంది. ఎన్నికల్లో వైఫల్యానికి సంకీర్ణ కూటమి పనితీరే కారణమంటూ ధ్వజమెత్తడమేగాక, కాంగ్రెస్‌ నాయకత్వాన్ని 'బఫూన్ల'తో పోల్చి మాజీ మంత్రి, శివాజీనగర్‌ ఎంఎల్‌ఎ ఆర్‌.రోషన్‌బేగ్‌ 'ఝలక్‌' ఇచ్చాడు. దీంతో కెెపిసిసి ఆయనకు  షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. తన వ్యాఖ్యలపై వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని రోషన్‌బేగ్‌ను కెెపిసిసి ఛీఫ్‌ దినేష్‌ గుండురావు ఆదేశించారు. 

గతంలో .సిద్దరామయ్య ప్రభుత్వంలో పట్టణాభివృద్దిశాఖ మంత్రిగా వున్న రోషన్‌బేగ్‌, తాజాగా కుమారస్వామి మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకునేందుకు యత్నించారు. అయితే సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో యువతకు పెద్దపీట వేసిన కాంగ్రెస్‌ నాయకత్వం.. మైనారిటీ కోటాలో ఇద్దరు యువకులకు అవకాశం కల్పించటంతో రోషన్‌బేగ్‌ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఐదు నెలల కిందట జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లోను పార్టీ టిక్కెట్‌ కోసం సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ద్వారా హైకమాండ్‌పై వత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. 

అప్పటినుంచి సమయం కోసం ఎదురు చూస్తున్న రోషన్‌బేగ్‌ తాజాగా ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ నాయకత్వంపై ధ్వజమె త్తారు. ఒక ఉర్దూఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ కర్ణాటక వ్యవ హారాల ఇంఛార్జీ కెసి.వేణు గోపాల్‌ను 'బఫూన్‌'గా అభి వర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అహంభావ వైఖరి వలన రాష్ట్రంలో పార్టీకి అతితక్కువ సీట్లు రానున్నాయన్నారు. దీనికి పార్టీ అధ్యక్షుడు దినేష్‌ గుండురావు కూడా కారణమని ఆరోపించారు.

కేంద్రంలో స్థాయిలో మోదీ సర్కారు అధికారంలోకి వస్తుందని, కర్ణాటకలో బిజెపి అత్యధిక లోక్‌సభ స్థానాలు దక్కించుకుం టుందని జోస్యం చెప్పారు. బిజెపి ముఖ్యమంత్రి డివి.నదానందగౌడ బెంగళూరులో హజ్‌హౌస్‌ నిర్మాణానికి  రూ 60కోట్లు మంజూరు చేశారని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనికి ఒక్కరూపాయి విడుదల చేయలేదని ఆరోపించారు. 

కేవలం ఒకరిద్దరి చేతుల్లోనే కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందని, ముస్లింలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటోందని రోషన్‌ దుయ్యబట్టారు. అవసరమైతే తాను బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధమంటూ ఓ ప్రశ్నకు బదులివ్వటంతో కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించింది.  మారుతున్న రాజకీయ పరిణామాల్లో ముస్లింలు అవసరమైతే బిజెపికు మద్దతు ఇచ్చినా తప్పులేదని వ్యాఖ్యానించారు. 

ఈ ఇంటర్వ్యూ స్థానిక ఛానెళ్లలో ప్రసారం అయిన వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి తన ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకుని బెంగళూరులోనే ఉండిపోయారు. మరోవంక  రోషన్ బేగ్ వ్యాఖ్యలు క్షేత్రస్థాయి పరిస్థితుల కు అద్దంపడుతున్నాయని కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు ఏహెచ్ విశ్వనాథ్ చెప్పారు. ము ఖ్యంగా సిద్ధరామయ్య గురించి బాగా అర్థం చేసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. తానూ చాలాకాలంగా ఇవే విషయాలు చెప్తున్నానన్నారు.