ఎగ్జిట్‌ పోల్స్‌ పై టిడిపిలో బెరుకు, వైసిపిలో అనుమానం !

ఎగ్జిట్‌ పోల్స్‌ నివేదికల అనంతరం అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నాయకత్వంలోనూ అంతర్మథనం మొదలైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్న విధంగానే ఫలితాలు వస్తాయా? లేదా? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దాదాపు 12 సంస్థలు నివేదికలు వెల్లడించినా ఒక్క సంస్థ అంచనా కూడా మరొక సంస్థ అంచనాకు దగ్గరగా లేకపోవడంతో ఎవరికివారు సర్దిచెప్పుకునే పనిలో పడ్డారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మొద్దని రెండు పార్టీల నాయకత్వమూ అభ్యర్థులకు చెబుతోంది. వాటిని చూసి ఎవరూ డీలాపడిపోవద్దని, అధికారం తమదేనని ధైర్యం చెబుతున్నారు. ఫలితాల వెల్లడికి రెండు రోజుల గడువుండంతో అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ నియోజవకర్గాల్లో కౌంటింగ్‌ ఏజెంట్లను సరిచేసుకునే పనిలో ఉన్నారు. ఫలితాలు ఎలా వచ్చినా ధైర్యంగా ఉండాలని సర్ధిచెబుతున్నారు. 

సర్వేలు చూసి తొందరపడొద్దని, కౌంటింగ్‌కు వెళ్లే ఏజెంట్లను కాపాడుకునే పనిలో నాయకత్వం ఉండాలని రెండు పార్టీలూ అభ్యర్థులను హెచ్చరించాయి. ఈ రెండు రోజులూ జాగ్రత్తగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రత్యర్థులు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని రెండు పార్టీల నాయకులూ హెచ్చరించారు.  

ఎక్కువ సర్వేలు వైసిపికి అనుకూలంగా నివేదిక ఇచ్చినా వాటిల్లో ఒకటీ అరా తప్ప అన్నీ కొత్త సంస్థలే కనిపిస్తున్నాయని, ఆయా సంస్థలు ఏలాభమూ లేకుండా ఎందుకు సర్వే చేస్తున్నాయనే అంశాన్ని నాయకత్వం ఆలోచించాలని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు క్యాడర్‌కు సూచించారు.   

ఏపీలో వైసిపి అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిస్తున్న కధనాలు ఆ పార్టీ నేతలకే నమ్మశక్యంగా లేనట్లు తెలిసింది. టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా 8.5 నుంచి 10 శాతం దాకా ఉందని జాతీయ చానళ్లు/సర్వే సంస్థలు చెప్పడంతో విశ్వసింపలేక పోతున్నారు. న్నికల్లో పది శాతం తేడా అంటే.. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని.. పోలింగ్‌ జరిగిన వెంటనే ఎవరు గెలుస్తారో చెప్పేయవచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ బూత్‌ స్థాయిలో అలాంటి పరిస్థితి లేదని.. పోటీ నువ్వానేనా అనేట్లుగా ఉందని చెబుతున్నారు. 

లోక్‌సభ స్థానాల విషయంలో టిడిపి కంటే వైసిపికి తగ్గుతాయని కొన్ని సర్వే సంస్థలు చెప్పడంతో కొంతమంది వైసిపి నేతల్లో ఆందోళన నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై తాము ఆధారపడటం లేదని, అధికారం తమదేననే ధీమా కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.