మహిళలకు మరోసారి దగా చేస్తున్న కెసిఆర్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క మహిళకు కుడా తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా 51 నెలలపాటు పదవీలో కొనసాగిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు అభ్యర్ధుల ఎంపికలో కుడా వారిని మరోసారి దగా చేస్తున్నారు. అసెంబ్లీ రద్దు రోజునే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి సంచలనం కలిగించిన ఆయన వారిలో కేవలం నలుగురు మహిళలకు మాత్రమే చోటు కల్పించడం విస్మయం కలిగిస్తున్నది. కనీసం గత ఎన్నికలలో ఇచ్చిన సీట్లు కూడా ఈ సారి వారికి ఇవ్వలేదు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీలో ఆరుగురికి సీట్లు ఇచ్చిన కేసీఆర్ ఈ సారి కేవలం నలుగురికే అవకాశం కల్పించారు. పురుషాధిక్యభావజాలం ఉన్న కేసీఆర్ మరోమారు మహిళలను అవమానించారనే విమర్శలు ఈ సందర్భంగా మహిళా సంఘాల నుండి వెలువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్త్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి, కెసిఆర్ కు కొండంత అండగా ఉన్న మహిళలకు మరోమారు మొండిచేయి చూపారని మహిళలు ఆవేదన ఆదన చెందుతున్నారు.

బడుగు, బలహీన వర్గాల మహిళలంటే చిన్నచూపు ఉండటంతోనే కొండా సురేఖ, బొడిగె శోభలకు మదటి జాబితాలో చోటు కల్పించలేదని ఆరోపణలు సహితం వినిపిస్తున్నాయి. రాజ్యసభ, శాసనమండలికి గత నాలుగేళ్ళలో ఎంపిక చేసిన వారిలో సహితం మహిళలకు చోటు దక్కక పోవడం తెలిసిందే. ఇక లోక్ సభ సభ్యులలో కెసిఆర్ కుమార్తె కవిత తప్ప మహిళలు ఎవ్వరు లేరు.

అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల కోసం గత నెలరోజులుగా పావులు కదపడంలో నిమగ్నమైన కెసిఆర్ ముందుగ అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనే హడావుడిలో సరిగ్గా కసరత్తు చేయలేదని అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి. జాబితాలో వివాదాల్లో ఉన్న నేతలకు కూడా టికెట్ ఖారారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జర్మనీ పౌరసత్వం విషయంలో చట్ట పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను పేరును అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు.భూ వివాదం, కలెక్టర్‌తో గొడవ వంటి వాటిల్లో చిక్కుకున్న జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరో అవకాశమిచ్చారు.

వీరేకాక పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్, మహబూబాబాద్ నుంచి శంకర్ నాయక్, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి తాటికొండ రాజయ్యలకు కూడా అవకాశమిచ్చారు. ఇక, కాంగ్రెస్ నేత డీకే అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డికి మక్తల్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు.

కాగా బాబూమోహన్, నల్లాల ఓదేలు తదితర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయిచూపిన కేసీఆర్ పార్టీ మారిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలలు అందరికి మాత్రం టికెట్ ఖరారు చేయడం విశేషం.

తన కుటుంభంలో తనతో సహా తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావులతో కలిపి ముగ్గురికి తిరిగి సీట్లు కేటాయింపు చేసుకున్నారు. మరోవంక రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఇద్దరికి అవకాశం దక్కింది. తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఖరారు కాగా, ఆయన సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీచేయనున్నారు. ఈ సీట్ ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నది కావడం గమనార్హం.

తుమ్మల నాగేశ్వరరావు వంటి పలువురు సీనియర్ లను లోక్ సభకు పంపుతారని, పలువురు లోక్ సభ సభ్యులను అసెంబ్లీకి తీసుకు వస్తారని ఉహాగానాలు వెలువడినా లోక్ సభ సభ్యుడు బల్కా సుమన్ ను అసెంబ్లీకి పొటీ చేయించడం మినహా ఎటువంటి మార్పులు చేయలేదు.