మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోతుందా?

సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీయే పక్షాలదే విజయం అంటూ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేయడంతో దేశ వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందంటూ గవర్నర్ అనందీబెన్ పటేల్‌కు బీజేపీ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం బలం నిరూపించుకునేలా వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

‘‘రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నందున వెంటనే అసెంబ్లీని సమావేశ పర్చాలని కోరుతూ గవర్నర్‌కి లేఖ రాస్తున్నాం. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తనంత తానే కూలిపోతుంది. ఎమ్మెల్యేలతో బేరసారాలు నడపడంపై నాకు నమ్మకం లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం గద్దె దిగే సమయం వచ్చింది..’ అని మధ్య ప్రదేశ్ విపక్ష నేత, బీజేపీ నాయకుడు గోపాల్ భార్గవ ప్రకటించారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమంటూ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మధ్య ప్రదేశ్‌లోని మొత్తం 29 స్థానాలకు గానూ బీజేపీ 24 వరకు గెలుచుకునే అవకాశాలున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 

కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్... దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెసిందే. అత్యల్ప మెజారిటీతో గట్టెక్కిన కాంగ్రెస్ పార్టీకి మాయావతి సారథ్యంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ మద్దతు ప్రకటించాయి.